విద్యారంగంపై విషపు చూపు! | Sakshi Editorial On Education sector in Andhra Pradesh Chandrababu Govt | Sakshi
Sakshi News home page

విద్యారంగంపై విషపు చూపు!

Jul 13 2025 5:11 AM | Updated on Jul 13 2025 5:11 AM

Sakshi Editorial On Education sector in Andhra Pradesh Chandrababu Govt

జనతంత్రం

ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్‌ అనే ముద్రను వేస్తుంది. 

ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ  వెనకాడటం లేదు.

ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్‌ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. 

ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్‌ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.

ఆరెస్సెస్‌ బాస్‌ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్‌ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్‌ ప్లస్‌ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్‌ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. 

అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్‌ మీద ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైన
అంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీల్లో చేర్చారు. 

ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్‌ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.

‘మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీట్‌’ అనే మరో గిన్నీస్‌ బుక్‌ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. 

అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్‌ రికార్డు బ్రేకింగ్‌ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 

74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్‌ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.

విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్‌ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్‌ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్‌ యాక్షన్‌ ప్లాన్‌. 

ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్‌ టీచర్‌ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్‌ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్‌ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్‌ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్‌ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్‌ సంకల్పానికి గండికొట్టారు. 

పేద విద్యార్థులు కూడా డిజిటల్‌ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్‌ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్‌ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. 

పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్‌ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.

పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్‌ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. 

ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. 

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్‌ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.

బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్‌ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. 

విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్‌ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్‌మోహన్‌ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.

అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్‌ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!

ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్‌ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. 

మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. 

పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement