ఆ తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం: కేటీఆర్‌

Kishan Reddy Misleading People on Flood Aid: KTR - Sakshi

కిషన్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు

ఆయనకు ఎన్డీఆర్‌ఎఫ్‌కు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు తేడా తెలియదు: మంత్రి కేటీఆర్‌

అలాంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం..

కేంద్రం ఏమిచ్చిందని మేం అంటే.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ లెక్కలు చెప్తారా?

రాష్ట్రానికి నయా పైసా సాయం తేలేని చేతకానితనమని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌), ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌)కు తేడా తెలియని కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరమని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణకు చేయాల్సిన వరద సాయంపై కిషన్‌రెడ్డి చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. కేంద్రం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని తాము డిమాండ్‌ చేస్తే.. రాష్ట్రానికి రాజ్యాంగ హక్కుగా దక్కే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ లెక్కలు చెప్తూ కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

ఆ నిధులు రాజ్యాంగ హక్కు
తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల నుంచి తిరిగి రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఒకటని, ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవగాహన లేదని కేటీఆర్‌ విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280 ప్రకారం ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రాష్ట్రాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. లోక్‌సభలో ఈ నెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ చేసిన ప్రకటనను కిషన్‌రెడ్డి ఒకసారి చదువుకోవాలన్నారు. 2018 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ద్వారా అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిత్యానంద్‌రాయ్‌ ప్రకటించిన మాట అబద్ధమా? కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన అబద్ధమా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌ వరదలప్పుడు ఒక్క పైసా ఇవ్వలే..
గతంలో భారీ వర్షాలతో హైదరాబాద్‌ మునిగి కష్టాలు పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు కోరితే.. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇప్పుడు కూడా భారీ వర్షాలతో ప్రాథమికంగా రూ.1,400 కోట్ల నష్టం వచ్చిందని, తెలంగాణకు ప్రత్యేక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు అందించాలని కోరితే.. కేవలం పరిశీలన బృందాలను పంపించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

2021లో బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు తౌక్టే తుఫాన్‌ వల్ల గుజరాత్‌లో వరదలు వచ్చినప్పుడు.. ప్రధాని ఆగమేఘాల మీద సర్వే జరిపించి రూ.1,000 కోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రత్యేక అదనపు సాయాన్ని అడ్వాన్స్‌ రూపంలో విడుదల చేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధికార బృందాలను పంపడం.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధులు మూటలు పంపడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలకు 2018 నుంచి ఇప్పటిదాకా రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని, ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సొంత రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. కేంద్రం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అదనపు నిధుల కోసం ప్రయత్నించాలని, లేకుంటే నయా పైసా సాయం తీసుకురాలేని చేతకాని మంత్రిగా కిషన్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top