Sakshi News home page

అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం 

Published Tue, Dec 5 2023 3:51 AM

Kishan Reddy: bjp win the most MP seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కలిసికట్టుగా ముందుకుసాగుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేలా పోరాడుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచినా మరింత గట్టిగా పోరాడి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు సాధించేలా ఇప్పటి నుంచే పట్టుదలతో కృషి ప్రారంభిస్తామని చెప్పారు.

ఎంతో కష్టపడినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని, 7 నుంచి 14 శాతానికి ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్‌ పెరిగిందని చెప్పారు. పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ప్రేంసింగ్‌రాథోడ్, చింతా సాంబమూర్తి, ప్రకాష్రెడ్డి తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓడిన స్థానాలపై జాతీయస్థాయి నుంచి జిల్లా, మండల, బూత్‌ స్థాయి వరకు సమీక్ష జరిపి వచ్చే లోక్‌సభ ఎన్నికలకల్లా లోటుపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు.  

లోక్‌సభకు ఓటేస్తామన్నారు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వెళ్లినప్పుడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు మద్దతు తెలిపే ఓటర్లు తాము అసెంబ్లీకి ఎవరికి ఓటేసినా పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారన్నారు. తాము గెలిచింది 8 స్థానాలే అయినా, 80 మంది ఎమ్మెల్యేల బలాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పారు. క్రియాశీల ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని తెలి పారు.

అధికార బీఆర్‌ఎస్‌పై ఐదేళ్లుగా బీజేపీ సాగించిన పోరు వల్ల కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో లాభం పొందిందన్నా రు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీపై పడి ఏడ్చి బురదచల్లిన వారు ఈ రోజు ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు.  

అక్కడ కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి లేదు  
కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్‌గఢ్, రా జస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకుందని, మధ్యప్రదేశ్‌లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించిందని చెప్పారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి అని చెబుతున్న రేవంత్‌రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించి రికార్డు సృష్టించారన్నారు.

ఇలాంటి రికార్డు దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదన్నారు. పార్టీ పోటీచేసిన స్థానాల్లో ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకుంటామని, ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల సరళి, ప్రభావం చూపిన అంశాలు, తదితర విషయాలపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాలు, రాబో యే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడం, తెలంగాణ ఎన్నికల తీరుతెన్నులపై సవివరంగా తెలియజేస్తామన్నారు. తమ పార్టీ వారే తనను ఓడించారని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా, ఆ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. 

బీఆర్‌ఎస్, మజ్లిస్‌ కుట్రలను తిప్పికొట్టారు: కిషన్‌రెడ్డి 
రాజాసింగ్‌ నివాసానికి వెళ్లి అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 
సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, మజ్లిస్‌ పార్టీల అధినేతలు కేసీఆర్, అసదుద్దీన్‌ ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యే రాజాసింగ్‌ బలమైన విశ్వాసం, ధైర్యంతో తిప్పికొట్టారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా మజ్లిస్‌ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ, ప్రజల ఆశీస్సులతో రాజాసింగ్‌ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారని అన్నారు.

అధికార దురి్వనియోగం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా గోషామహల్‌లో ధర్మం, జాతీయ భావజాలమే గెలిచింద ని పేర్కొన్నారు. సోమవారం గోషామహల్‌లో రాజా సింగ్‌ నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనను అభినందించారు. తప్పుడు ప్రచారాలతో అనేక శక్తులు పన్ని న కుట్రలను ఎదుర్కొని బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ను గెలిపించిన గోషామహల్‌ ప్రజలకు, ఆయన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్నరోజుల్లో పార్టీ మరింత విస్తరణకు రాజాసింగ్‌ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.    

Advertisement

What’s your opinion

Advertisement