ఆ ఇద్దరితోనే టీడీపీ పతనం.. కిలారి ఆరోపణల దుమారం

Kilari Venkataswamy Naidu Fires On TDP Leaders In Nellore - Sakshi

నెల్లూరు (టౌన్‌): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌తోనే పార్టీ పతనమవుతుందని ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కిలారి వెంకటస్వామినాయుడు ధ్వజమెత్తారు. సోమవారం బీవీనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన కార్పొరేషన్‌ ఎన్నికల సమీక్షలో చంద్రబాబు చెప్పుడు మాటల విని తనను సస్పెండ్‌ చేశారన్నారు. బీద రవిచంద్ర, అబ్దుల్‌ అజీజ్‌ ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అజీజ్‌ రూ.4 కోట్లకు అమ్ముడుపోయారన్నారు.

చదవండి: Nellore: టీడీపీలో ‘కార్పొరేషన్‌’ బ్లో అవుట్‌.. రాజీనామాల బాట 

గతంలో వైఎస్సార్‌సీపీ టికెట్‌ ఇచ్చి మేయర్‌ను చేస్తే అమ్ముడుపోయిన వ్యక్తి అన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎవరినైనా సంప్రదించి టికెట్లు ఇచ్చావా అని ప్రశ్నించారు. కార్పొరేషన్‌ పరిధిలో అన్ని డివిజన్లల్లో పార్టీ ఘోరంగా ఓడిపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. అక్కచెరువుపాడులో రూ.7 కోట్లకు పనులు తీసుకున్నారని ఆరోపించారు. పొట్టేపాళెం, ధనలక్ష్మీపురం లేవుట్లలో ముడుపులు తీసుకున్న సంగతి మరిచిపోయావాని అజీజ్‌ను ప్రశ్నించారు. పగలు టీడీపీతో రాత్రులు ప్రత్యర్థులతో బిరియానీలు తింటారని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీట్లే అమ్ముకున్నారని సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే అన్నాడని గుర్తు చేశారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిని చెప్పుకునే బీద రవిచంద్ర కాల్‌ లిస్టును బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. బీద, అజీజ్‌లు టీడీపీని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. పైరవీలు చేసి పదవులు పొంది డబ్బులు సంపాదించిన ఘనత బీద రవిచంద్రదన్నారు. బీద, అజీజ్‌ ఒకే సామాజికవర్గ నాయకులను టార్గెట్‌ చేశారన్నారు. బీద, అజీజ్‌ల వల్ల సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికలకు పార్టీ నుంచి రూ.30 కోట్లు ఇచ్చారని, ఆ డబ్బులకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కావలిలో నీ పోరాట పటిమ చూపించాలన్నారు. కనీసం అన్నను కూడా పార్టీని వీడిపోకుండా చూడలేని పరిస్థితి నీదన్నారు. ఆ నాడు మంత్రిని అడ్డుపెట్టుకుని అన్ని తానై వ్యవహరించి చేతినిండా డబ్బులు సంపాదించుకున్నాడని బీద రవిచంద్రపై మండి పడ్డారు. నేను కుమ్మకైయ్యారని నిరూపిస్తే ఉరి శిక్షకైనా సిద్ధపడతానని, మీరు కుమ్మకైయ్యారని నిరూపిస్తే మీరు ఎలాంటి శిక్షకు సిద్ధంగా ఉన్నారని సవాల్‌ విసిరారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top