అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కాకుమాను రాజశేఖర్‌ | Kakumanu Rajasekhar Fires On Chandrababu Government Over AP Debts In 7 Months, More Details Inside | Sakshi
Sakshi News home page

అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కాకుమాను రాజశేఖర్‌

Jan 31 2025 3:46 PM | Updated on Jan 31 2025 5:12 PM

Kakumanu Rajasekhar Fires On Chandrababu Government

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చేసిన రూ.1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి, ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల్లో చేసిన రూ.1.19 కోట్ల అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి, ఆ అప్పు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆ బాధ్యత కచ్చితంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై ఉందని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనంత అనుభవజ్ఞుడు లేడని చెప్పే చంద్రబాబు, ఎన్నికల ముందు గొప్పగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్‌ హామీలు అమలు చేయకుండా, సాకులు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు.

కరోనా సంక్షోభంలో ఎలాగైతే వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను కొనసాగించారో.. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పని చేయాలని సూచించారు. పథకాలు అమలు చేయబోమని చంద్రబాబు చెబుతున్నా.. పవన్‌కళ్యాణ్‌ తేలు కుట్టినా దొంగలా సైలెంట్‌గా ఉండటానికి కారణమేంటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకుమాను రాజశేఖర్‌ ప్రశ్నించారు.

ఆత్మవిమర్శ చేసుకోవాలి:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతోంది. ఈ  సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను కూటమి పార్టీలు ఏ మేరకు నెరవేర్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మేలు గుండు సున్నా. ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కాని వాగ్ధానాలు చేర్చడం, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా మోసం చేయడం చంద్రబాబుకి పరిపాటిగా మారింది. ప్రజలను మోసం చేసి చంద్రబాబు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు మోసాలపై బీజేపీకి క్లారిటీ ఉంది కాబట్టే ఆ మేనిఫెస్టో రిలీజ్‌ చేసే సమయంలో దాన్ని ముట్టుకోవడానికి కూడా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఇష్టపడలేదు.

ప్రజలతో మూడు ముక్కలాట:
పాలనపై చంద్రబాబు పట్టుకోల్పోయారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగడం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లు ప్రజల ఆశలతో మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. వైయస్సార్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం మినహా 8 నెలల్లో జరిగింది శూన్యం. గత వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని పలు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. కోవిడ్‌ సమయంలో జగన్‌ చేసిన పాలనకు దేశమే బ్రహ్మరథం పట్టింది. అయినా కరోనా సాకు చూపించి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూడకపోవడం ఆయన గొప్పతనం. నేడు పరిస్దితులన్నీ బాగానే ఉన్నా, అనుభవశాలినని చెప్పుకునే చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అమలు చేయలేక పిల్లి మొగ్గలేస్తున్నాడు.

ఆయన ఏనాడూ సాకులు చెప్పలేదు:
జగన్‌ మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అమలు చేస్తే చంద్రబాబు మాత్రం ప్రజల్ని వంచించడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యేనాటికి టీడీపీ ప్రభుత్వం  ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉంచి దిగిపోయింది. అయినా చంద్రబాబులా జగన్‌ సాకులు వెతుక్కోకుండా నవరత్నాలను అమలు చేసి చూపించారు. ఈ 8 నెలల్లో దాదాపు 1.19 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయారు. పైగా గత ప్రభుత్వ అప్పులంటూ సాకులు వెతుకుతూ వైఎస్‌ జగన్‌ పాలనపై బురదజల్లాలని చూస్తున్నారు. ఈ ఎనిమిది కాలంలో చంద్రబాబు చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

కరోనా లాంటి సంక్షోభ పరిస్థితులున్నా వైఎస్‌ జగన్‌ ఎలాగైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో.. చంద్రబాబు కూడా కారణాలు వెతకడం మానేసి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. అమలు చేయలేకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి. అవసరమున్నా లేకపోయినా ప్రతి సందర్భంలో ఐయామ్‌ ప్రజెంట్‌ అంటూ తలదూర్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా దాక్కోవడం సరైన పద్ధతి కాదు. సూపర్‌ సిక్స్‌ హామీలపై గ్యారంటీ ఇస్తూ సంతకం చేసిన ఆ పెద్ద మనిషి తక్షణం స్పందించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా డైవర్షన్‌ పాలిటిక్స్‌ మీద కాకుండా మేనిఫెస్టో అమలుపై చిత్తశుద్ధితో పని చేయాలని కాకుమాను రాజశేఖర్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement