చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ!.. దత్తపుత్రుడి వల్లే గొడవలచ్చాయని..

Jayalalithaa Niece Deepa Targets Sasikala In A Audio - Sakshi

దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ – మేన కోడలు దీప జయకుమార్‌ మధ్య వివాదం ముదిరింది. చిన్నమ్మ శశికళను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలతో జయలలిత మేన కోడలు దీప శనివారం ఓ ఆడియోను విడుదల చేశారు. దత్త పుత్రుడు సుధాకరన్‌ వివాహం విషయంలోనే.. తన మేనత్త జయలలిత కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తారు. శశికళ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణించిన తరువాత ఆస్తికి వారసులుగా ఆమె అన్న కుమార్తె దీప, కొడుకు దీపక్‌ తెరపైకి వచ్చారు. కోర్టు సైతం వీరినే జయ వారసులుగా ధ్రువీకరించింది. అదే సమయంలో దీప ఓ రాజకీయ పార్టీ స్థాపించి ముందుకు సాగినా, చివరికి వెనక్కి తగ్గింది. అదే సమయంలో జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా దీప తరచూ వ్యాఖ్యల చేసేవారు. తాజాగా శశికళను ఢీకొట్టే విధంగా పలు ఆరోప ణాలు గుప్పిస్తూ.. ఓ ఆడియోను బుజ్జమ్మ దీప విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

తాజా వివాదానికి నేపథ్యం ఇదేనా..? 
జయలలిత మృతి నేపథ్యంలో నెలకొన్న వివాదాన్ని విచారించిన ఆర్ముగ స్వామి కమిషన్‌కు శశికళ లిఖిత పూర్వకంగా సమర్పించిన వాంగ్మూలంలోని కొన్ని అంశాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఇందులో దీప కుటుంబం, ఆమె తల్లి విజయలక్ష్మి గురించి శశికళ తీవ్ర వ్యాఖ్యలు చేసిందనే వార్తలొచ్చాయి. దీనిపై దీప తీవ్రంగా మండిపడుతూ ఆడియోను విడుదల చేయడం విశేషం. 

అనుమానాలెన్నో.. 
ఇప్పుడున్న మర్యాదను చెడ గొట్టుకోవద్దని, ఏ తప్పు చేయనప్పుడు, నిరూపించుకునేందుకు సిద్ధమా..? అని శశికళకు దీప సవాల్‌ విసిరారు. సుధాకరన్‌ పెళ్లి తర్వాత తన తండ్రి జయకుమార్‌ మరణించారని, ఏ కారణంతో ఈ మరణం సంభవించిందో.. నేటికీ వెల్లడి కాలేదన్నారు. తమపై కక్ష సాధింపులో భాగంగానే లేనిపోని చాడీలను మేనత్త వద్ద శశికళ నూరి పోసిందని మండిపడ్డారు. అందుకే శశికళపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని తాను డిమాండ్‌ చేస్తూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. తొలుత తన సోదరుడు దీపక్‌ను బలవంతంగా తన గుప్పెట్లోకి శశికళ లాక్కుందని ఆరోపించారు. శశికళకు వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

మేనత్త జయలలిత మరణం సందర్భంగా శశికళ వ్యవహరించిన తీరు, తమ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించాయని వెల్లడించారు. ఏ తప్పు చేయలేదని చెబుతున్న శశికళ, మేనత్తను చూసేందుకు తమకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని, సీసీ కెమెరాలన్నీ ఎందుకు ఆపేయించారని ప్రశ్నించారు. వారి స్వలాభం, ఆదాయం కోసం తన మేనత్త జయలలితను తప్పుదారి పట్టించి వాడుకున్నారని ఆరోపించారు. నిజాలు, రహస్యాలను మరెన్నో రోజులు దాచి పెట్ట లేరని, త్వరలో అన్ని బయటకు వచ్చి తీరుతాయని స్పష్టం చేశారు. 

ఆడియో రూపంలో.. 
వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తే.. తన మేనత్త జయలలిత మృతిపై అనుమానం అనే ప్రశ్నే వచ్చి ఉండేది కాదని ఆడియోలో దీప పేర్కొన్నారు. తన తల్లి విజయలక్ష్మి గురించి మాట్లాడేందుకు మూడో వ్యక్తిగా ఉన్న శశికళకు ఏం అర్హత ఉందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావును కలిసి అప్పట్లో తన తల్లి విజయలక్ష్మి మేనత్త జయలలితకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు శశికళ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వాస్తవానికి తన మేనత్తకు శశికళ రూపంలోనే ప్రమాదం పొంచి ఉండేదని, ఆమెను రక్షించేందుకే తన తల్లి ప్రధానిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. దత్త పుత్రుడు సుధాకరన్‌ వివాహం కారణంగానే మేనత్తతో తన కుటుంబానికి మనస్పార్థలు వచ్చినట్లు వివరించారు. తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు నిందలను తమ మీద వేయడం శశికళకు కొత్తేమీ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి విజయలక్ష్మి గతంలో కలైంజ్ఞర్‌ కరుణానిధి, వాలప్పాడి రామమూర్తి వంటి నేతలను కలిసిన సందర్భాలు లేవు అని, ధైర్యం ఉంటే తనతో చర్చకు శశికళ సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు.

మౌనంగా ఉండకుంటే గుట్టు విప్పుతాం.. 
తన కుటుంబం, తన తల్లి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోనని శశికళను దీప హెచ్చరించారు. శశికళ నోరు మూసుకుని మౌనం పాటిస్తే ఆమెకే మంచిదని.. లేనిపక్షంలో గుట్టు విప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. తన జీవితాన్ని సర్వనాశనం చేశారని, తన కడుపులో ఉన్న బిడ్డను చిదిమేశారని, తన తల్లి భౌతిక కాయాన్ని కూడా చూడనివ్వకుండా జయలలితను అడ్డుకున్నది శశికళే కదా.. అని ఆరోపించారు.

మధ్య తరవాతి స్థాయికి కూడా నోచుకోని శశికళకు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయనే విషయంపై.. ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఇకనైనా ఈ విషయంపై శశికళను అన్నాడీఎంకే కేడర్‌ ప్రశ్నించాలని, రాష్ట్ర ప్రజలు సైతం నిలదీయాలని కోరారు. తనకు శశికళ రూపంలో ప్రాణహాని ఉందని ఆరోపించారు. కాగా ఈ దీప వ్యాఖ్యలపై చిన్నమ్మ శశికళ ఎలా స్పందిస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top