జనసేనకు మరో షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి కీలక నేతలు | Meda Gurdatta Prasad And Some Other Janasena Leaders Also Joined In YSRCP - Sakshi
Sakshi News home page

జనసేనకు మరో షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి కీలక నేతలు

Published Fri, Nov 24 2023 6:16 PM

Janasena Meda Gurdatta Prasad Joined In YSRCP - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో జనసేన పార్టీకి మరో షాక్‌ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో జనసేన మాజీ ఇన్‌ఛార్జ్‌ మేడా గురుదత్త ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. గురుదత్తతో పాటు మరికొందరు జనసేన నేతలు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. 

వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన మాజీ ఇన్‌ఛార్జ్‌ మేడా గురుదత్త ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో గురుదత్త ప్రసాద్‌తో పాటు జనసేన నాయకులు మండపాక శ్రీను, అడబాల సత్యనారాయణ, వడ్డి చిన్నా, నాగవరపు భానుశంకర్, వల్లేపల్లి రాజేష్, చొంగా మణికంఠ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. 

వైఎస్సార్‌సీపీలోకి సందీప్‌, పద్మావతి
ఇదిలా ఉండగా.. ఇటీవలే జనసేన కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్‌తో పాటు రాయలసీమ రీజియన్‌ ఇంఛార్జి పద్మావతిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు.  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వీరు వైఎస్సార్‌సీపీ కండువా కప్పేసుకున్నారు. ఈ సందర్బంగా పవన్‌పై సంచలన ఆరోపణలు, తీవ్ర విమర్శలే చేశారు. 

‘పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీలో ఉండే రుక్మిణి అంటే భయం. ఆమె మాట విని చాలామందిని రోడ్డు మీదకు నెట్టారు.  ఆయనో అహంకారి. తన స్వార్థం కోసం ఎంతో మందిని బలి చేశారు. యువతను దారుణంగా మభ్య పెడుతున్నారు. తాను లేకుండా నాదెండ్ల కూడా అసెంబ్లీకి వెళ్లకూడదనుకునేతత్వం పవన్‌ది. జనసేన ఆఫీసుకు వచ్చే హవాలా డబ్బును మార్చేది నాదెండ్లనే. హైదరాబాద్‌లో భూకబ్జా కేసులో ఏ1గా ఉన్న వ్యక్తిని జనసేన కమిటీలో పవన్‌ పెట్టారు. రాజకీయాల్లో మాట తప్పి.. టీడీపీ కోసమే పవన్‌ పని చేస్తున్నారు. టీడీపీ పంచన చేసి నమ్ముకున్న మాలాంటి వాళ్లను మోసం చేశారు’ అని పసుపులేటి సందీప్ అన్నారు. 

‘చిరంజీవి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చా. 2014లో జనసేనకు అండగా నిలబడింది నేనే. పవన్‌ను నమ్మి నా బిడ్డను ఆయన దగ్గరికి పంపాను. కానీ, ఆయన నా బిడ్డను రోడ్డున పడేశారు. ఒక తల్లిగా చెప్తున్నా.. మీ బిడ్డల్ని ఆయన దగ్గరకు పంపొద్దు. పార్టీలో మహిళలను నాదెండ్ల ఎదగనివ్వడం లేదు. పవన్‌ సరిగా లేనందు వల్లే పార్టీలో మహిళలకు గౌరవం లేకుండా పోయింది. ఈ అంశం మీద ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం’ అని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. 


 

 
Advertisement
 
Advertisement