వైఎస్సార్‌ సీపీలో చేరిన జనసేన కార్యకర్తలు

Janasena Leaders Join YSRCP In Vijayawada Today - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీతో జనసేన లోపాయికారి ఒప్పందం నచ్చకపోవడం వల్లే చాలా మంది ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తమకు జనసేనలో అన్యాయం జరిగిందని ఎవరైనా బయటకు వస్తే వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఫాంహౌజ్‌కే పరిమితం కావడం వల్ల స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకోలేని స్థితిలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఆయనకు తన పార్టీలో ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. విజయవాడలోని  64 డివిజన్లు తామే గెలుస్తామని మంత్రి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పలువురు జనసేన కార్యకర్తలు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో శనివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. జనసేన అభ్యర్థి హరీష్‌ కుమార్‌ సహా ఇతర కార్యకర్తలకు కండువా కప్పి వెల్లంపల్లి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘జనసేన అభ్యర్ధిగా బీ-ఫామ్ ఇచ్చి, గెలుపు కోసం కాకుండా టీడీపీ గెలవాలని స్ధానిక జనసేన నాయకులే సొంత‌క్యాడర్‌ను ఓడించేందుకు ప్రయత్నించడం బాధాకరం. టీడీపీ- జనసేన ఒప్పందం నచ్చకే ఈ వలసలు. చంద్రబాబుతో పవన్ అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఫాంహౌజ్‌లో ఉండే పవన్‌.. ఇకనైనా కళ్లు తెరవాలి. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వారు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారు. స్ధానికంగా జనసేన-టీడీపీ నేతలు చేసుకున్న ఒప్పందం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వైఎస్సార్‌ సీపీని ఓడించేందుకు, టీడీపీ జనసేనకు, జనసేన టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయాలనే దిక్కుమాలిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రజలంతా గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

చదవండిచంద్రబాబు మేనిఫెస్టో.. ఓ 420 వ్యవహారం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top