
తాడేపల్లిరూరల్: రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమపథకాలను, అభివృద్ధిని ఏకకాలంలో అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే రాబోయే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా పట్టాభిషేకం చేద్దామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్రిష్టియన్పేట నవోదయకాలనీలో తాడేపల్లి పట్టణ, రూరల్ వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని విజయసాయిరెడ్డి గురువారం రాత్రి ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు ఇక నుంచి ఈ కార్యాలయం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని అన్నారు.
మంగళగిరి శాసనసభ్యుడిగా నిత్యం అందుబాటులో ఉండే స్థానికుడు కావాలా... చుట్టంచూపులా వచ్చే పరదేశి కావాలో మీరే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నివాసముండే వ్యక్తి వల్ల స్థానిక ప్రజలకు అపాయింట్‌మెంట్ దొరికే అవకాశం లేదన్నారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రావడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. గతంలో ఆర్కేకి ఎలా సహకరించి గెలిపించారో.. అదేవిధంగా సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసే వ్యక్తి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.
ఇక్కడ చేనేత వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, అది ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేని కాలంలో నియోజకవర్గ సమన్వయ కర్త గంజి చిరంజీవి అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి పార్టీ కార్యాలయాలు ప్రజలందరికి అందుబాటులో ఉంటాయన్నారు. దుగ్గిరాల మండలంలో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్ధను మెరుగుపరచడం, కాలువల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
త్వరలో నియోజకవర్గంలో నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తామని, క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ సమన్వయ కర్త గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎంటీఎంసీ «అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమరా నాగయ్య, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, రూరల్ అధ్యక్షుడు మున్నంగి వివేకానందరెడ్డి, జెసీఎస్ కో ఆర్డినేటర్ డేవిడ్‌రాజు పాల్గొన్నారు.