కర్నూలు టీడీపీలో ముసలం.. నాలుగు స్తంభాల ఆట మొదలైంది

Internal Clash Between TDP Leaders In Kurnool District Over MLS Tickets - Sakshi

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా టికెట్ నాదంటే..నాదే అని పోటీ పడుతున్నారు. టికెట్ కోసం నాలుగు స్తంభాలాట మొదలైంది. దీనితో ఆలూరు టిడిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ని ఢీకొనే సత్తా లేకున్నా టిడిపిలో బలమైన నాయకుల కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం..

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. గతంలో టిడిపికి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం నుండి 30 ఏళ్ళపాటు టిడిపి తన పట్టు కాపాడుకుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత చరిత్ర తిరగరాసారు. గత ఎన్నికల్లో అయితే జిల్లాలోనే టీడీపీకి అడ్రస్సే లేకుండా పోయింది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో తిరిగి పుంజుకోవడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఆలూరు నియోజకవర్గంలో టిడిపి నాయకుల మధ్య ఐకమత్యం లేకపోవడం, పార్టీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో తిరిగి కోలుకోలేని విధంగా తుడిచిపెట్టుకొని పోయింది. 

ఆలూరులో తొలినుంచీ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ...2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించగా...ఓటమి ఎదురైంది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో తెలుగుదేశం పత్తా లేకుండా పోయింది. 2009 నుంచి చంద్రబాబు కారణంగానే టీడీపీ ఓడిపోతోందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో అప్పుడే టిడిపిలోకి వచ్చిన కోట్ల సుజాతమ్మకు సీటు ఇవ్వడంతో ఇక్కడ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. 2014లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ ను కాదని... కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వడంతో ఆమెకు వీరభద్రగౌడ్ వర్గం సహకరించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం ముందు కోట్ల సుజాతమ్మ నిలవలేకపోయారు. 

మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆలూరులో నాలుగు స్తంభాల ఆట మొదలైంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో టిడిపిలో వర్గ విభేదాలు ఏస్థాయిలో ఉన్నాయో అందరికీ అర్దమవుతోంది. చంద్రబాబు ఆలూరు పర్యటనలోనే విభేదాలు భగ్గుమన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోనే నాలుగు టిడిపి కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వీరభద్రగౌడ్, కోట్ల సుజాతమ్మ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మరోవైపు వైకుంఠం శివప్రసాద్,  వైకుంఠం మల్లికార్జున వేరు వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లులో కన్ ఫ్యూజన్ మొదలైంది. ఆలూరులో ఇంత గందరగోళం ఏర్పడటానికి పార్టీ అధినేత చంద్రబాబే కారణం అంటూ అక్కడి నాయకులే విమర్శిస్తున్నారు.

చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్లే పార్టీ దెబ్బతిన్నదని..పార్టీ నాయకులకే న్యాయం చెయ్యలేని బాబు ప్రజలకు ఏమి చెయ్యగలడని టిడిపి నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top