Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్‌ఎస్‌ రోడ్‌మ్యాప్‌ 

Huzurabad: TRS And BJP Election Winning Strategies In Huzurabad - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాషాయ తీర్థం పుచ్చుకునే తేదీ ఖరారైంది. ఈనెల 14న ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు శామీర్‌పేటలోని నివాస గృహానికి బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులంతా వచ్చి ఈటలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతోపాటు జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కూడా బీజేపీలో చేరనున్నారు.

ఇదంతా ఊహించినదే అయినా.. ఈటల బీజేపీలో చేరిన తరువాత చోటు చేసుకునే పరిణామాలపై ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. బీజేపీలో చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుండడంతో ఉప ఎన్నికకు శంఖారావం ఊదినట్టే. ఈ పరిస్థితుల్లో గెలుపు కోసం ఈటల తరఫున బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రణరంగంలోకి దిగబోతున్నాయి.

ఈటలను హుజూరాబాద్‌లో ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఇప్పటికే పక్కా ప్రణాళికతో రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసింది. బీజేపీ కూడా అందుకు రెడీ అయింది. టీఆర్‌ఎస్‌ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ ఉప ఎన్నికను పర్యవేక్షించనుంది. బీజేపీ తరఫున హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇన్‌చార్జీలుగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను నియమించారు. ఈ నెల 15 నుంచి వీరంతా కార్యరంగంలోకి దిగనున్నారు. పర్యవేక్షకులుగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. 

సీఎం కేసీఆర్‌తో గంగుల భేటీ

  • హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఖాయమని తేలిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి గంగుల కమలాకర్‌ శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. 
  • హుజూరాబాద్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు మండలాల వారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల వైఖరి తదితర అంశాలను సీఎంకు వివరించినట్లు సమాచారం. మండలాల వారీగా సమావేశాలు జరుపుతున్నప్పుడు ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పట్ల కనిపిస్తున్న అభిమానం, ఈటలపై వ్యతిరేకతను కూడా ఆయన వివరించినట్లు తెలిసింది. 
  • హుజూరాబాద్‌లో విజయమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పనిచేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. 
  • కాగా.. 13, 14 తేదీల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మండలాల వారీగా చేపట్టబోయే కార్యక్రమాల రోడ్‌ మ్యాప్‌ను ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధం చేశారు. 
  • మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు వి.సతీశ్, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, రమేశ్, చల్లా ధర్మారెడ్డి ఐదు మండలాల్లో పర్యటిస్తూ ప్రజలను, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. 

బీజేపీ ఇన్‌చార్జీల నియామకం

  • ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడం ఖాయం కావడంతో ఆ పార్టీ కూడా హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 
  • 14న ఈటల ఢిల్లీలో బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్‌లో కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించారు. 
  • రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. 
  • శుక్రవారం రాత్రి నియోజకవర్గంలో మండలాల వారీగా బీజేపీ ఇన్‌చార్జీలను నియమించారు. 
  • కమలాపూర్‌కు ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్‌కు ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, వీణవంకకు సోయం బాపూరావు, జమ్మికుంట, ఇల్లంతకుంటలకు ఎమ్మెల్యే రాజాసింగ్‌లను నియమించారు. 
  • పర్యవేక్షకులుగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి వ్యవహరిస్తారు. 
    చదవండి: ఈటలపై బరిలోకి కౌశిక్‌రెడ్డి?!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top