Huzurabad: ఈటలపై బరిలోకి కౌశిక్‌రెడ్డి?!

Padi Kaushik Reddy Gives Clarity ON Meeting With KTR - Sakshi

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఖాయమైన వేళ ప్రచారం

నియోజకవర్గానికి వచ్చిన కేటీఆర్‌తో కాంగ్రెస్‌ నేత భేటీకి ప్రాధాన్యత

మర్యాదపూర్వకంగానే కలిశా: కౌశిక్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుండటంతో ఖాయం కానున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఈటల చేతిలో ఓడిన పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమవుతోందా? తాజాగా చోటుచేసుకు న్న పరిణామాలు ఈ దిశగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

కేటీఆర్‌తో ఫొటోలు వైరల్‌... 
కౌశిక్‌రెడ్డి స్నేహితుడి తండ్రి పది రోజుల కిందట మరణించగా ఆయన దశ దినకర్మ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పక్కనే కూర్చున్న కౌశిక్‌రెడ్డి కాసేపు ఆయనతో మాట్లాడుతూ కనిపించారు. కేటీఆర్‌ తిరిగి వెళ్లే సమయంలోనూ ఆయన కారు వద్ద ఏకాంతంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వరుసకు సోదరుడయ్యే కౌశిక్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు వార్తలు షికారు చేశాయి. అయితే ఈ ప్రచారాన్ని కౌశిక్‌రెడ్డి తోసిపుచ్చారు. కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని ఓ వీడియాను విడుదల చేశారు. 

టీఆర్‌ఎస్‌కు అభ్యర్థి కొరత... 
ఈ నెల 14న బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆ పార్టీ హుజూరాబాద్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనుండటం ఖాయం కావడంతో టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరిని పోటీలో నిలపాలనే చర్చ కొన్ని రోజులుగా గులాబీ దళంలో సాగుతోంది. అయితే ఈటలను ఢీకొనే స్థాయి గల నాయ కుడు టీఆర్‌ఎస్‌ నుంచి హుజూరాబాద్‌లో ఎవరూ ఎదగకపోవడం ఆ పార్టీలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఈటలపై పోటీ చేసి ఓడిన వకులాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి ఒక్కొక్కరి పేర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేసులో వినిపించగా తాజాగా పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వంపైనా చర్చ జరుగుతోంది. 

ఈటల వ్యతిరేకిగా ముద్ర... 
2018 ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన కౌశిక్‌ సుమారు 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా హుజూరాబాద్‌లో సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నారు. ఈటలను టార్గెట్‌ గా చేసుకొని విమర్శలు కురిపించేవారు. టీఆర్‌ఎస్‌లో ఈటలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ అగ్రనేతలు సాను భూతి వ్యక్తం చేసినా కౌశిక్‌రెడ్డి మాత్రం ఈటల భూకబ్జాల పేరుతో మీడియా సమావేశాలు పెట్టి మరీ ధ్వజమెత్తారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top