కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

Huzurabad Congress Leader Kaushik Reddy Resigns To Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్‌ రెడ్డి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. రాజీనామా ప్రకటన అనంతరం కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు నాకు సహకరించడం లేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇతరులకు పదవులిస్తున్నారు. పార్టీ పదవుల విషయంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొందరు సీనియర్‌ నేతలు పార్టీకి నష్టం కల్గిస్తున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్‌ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యారు. సీనియర్లను కాదని రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడం నన్ను బాధించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ కష్టం’’ అన్నారు కౌశిక్‌ రెడ్డి. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, టీఆర్‌ఎస్‌ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు నేపథ్యంలో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ సంఘం కౌశిక్‌రెడ్డికి ఇచ్చిన నోటీస్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

దీని గురించి గతంలో కౌశిక్‌రెడ్డిని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు రాలేదని క్రమశిక్షణ సంఘం తెలిపింది. ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక తథ్యమైన హుజూరాబాద్‌లో.. టీఆర్‌ఎస్‌ తనకే టికెట్‌ ఇస్తుందని ఫోన్‌లో కౌశిక్‌ రెడ్డి స్థానిక నాయకులతో చెప్తున్నట్లు ఉన్న ఆడియో క్లిప్‌ వైరలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top