Karnataka Hijab Row: Priyanka Gandhi Said Women's Right to Decide What She Wants to Wear - Sakshi
Sakshi News home page

Hijab Row: ముస్లిం విద్యార్థులకు ప్రియాంక మద్దతు.. బికినీ, జీన్స్‌, హిజాబ్‌ ఏదైనా అంటూ..

Published Wed, Feb 9 2022 7:08 PM

Hijab Row: Priyanka Gandhi Says Women Have right to Wear Bikini Ghoon Jeans - Sakshi

లక్నో/న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదం కర్ణాటకలో తాత్కాలికంగా సద్దుమణిగినా దాని ప్రకంపనలు మాత్రం దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ బుధవారం దీనిపై స్పందించారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నది వాళ్ల ఇష్టానికే వదిలేయాలన్నారు. కినీ, ఘూంఘట్, జీన్స్, హిజాబ్‌... ఇలా ఏం ధరించాలన్నది మహిళలకు రాజ్యాంగమిచ్చిన హక్కని బుధవారం ఆమె అభిప్రాయపడ్డారు. వీటిపై బీజేపీ మండిపడింది.

విద్యార్థినులకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ బికినీ పదం వాడటం దారుణమని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఎం.పి.రేణుకాచార్య అన్నారు. తల్లి సోనియాది ఇటలీ గనుక భారత సంస్కృతి, సంప్రదాయాలు ప్రియాంకకు అర్థం కావంటూ ఎద్దేవా చేశారు. బికినీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని మహిళలకు, విద్యార్థినులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొందరు మగాళ్లను రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవడం వల్లే రేప్‌ కేసులు పెరుగుతున్నాయంటూ ఆయన వివాదాస్పద కామెంట్లు చేశారు.

తర్వాత అందుకు క్షమాపణ కోరారు. హిజాబ్‌ వివాదం కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘టూల్‌ కిట్‌ గ్యాంగ్‌’ పనేనని వీహెచ్‌పీ ఆరోపించింది. దేశవ్యాప్తంగా అరాచక వాతావరణం సృష్టించేందుకే ఈ ‘హిజాబ్‌ జిహాద్‌’కు కాంగ్రెస్‌ తెర తీసిందని వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ విమర్శించారు. వారి ఆటలను సాగనివ్వబోమన్నారు. కుట్రదారులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.

పాక్‌ స్పందించడం సిగ్గుచేటు: బీజేపీ
హిజాబ్‌కు మద్దతుగా పాకిస్తాన్‌ మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ మండిపడ్డారు. మైనారిటీల హక్కులను నిత్యం కాలరాస్తున్న దేశం నీతులు చెబుతోందంటూ దుయ్యబట్టారు. భారత్‌లో దారుణం జరుగుతోందని, హిజాబ్‌ను అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనేనని పాక్‌ మంత్రులు షా మహమూద్‌ ఖురేషీ, ఫవాద్‌ çహుస్సేన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ ప్రతిçష్టకు మచ్చ తెచ్చే దురుద్దేశంతోనే కొందరు హిజాబ్‌ గొడవకు మతం రంగు పులిమారని ఆరోపించారు.

15 మంది అరెస్టు
మరోవైపు కర్ణాటక మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ వివాదంపై చర్చించింది. కోర్టు తీర్పు కోసం వేచిచూడాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా 15 మందిని అరెస్టు చేశామని, వారిలో విద్యార్థులెవరూ లేరని మంత్రులు వెల్లడించారు. మరోవైపు మధ్యప్రదేశ్, పుదుచ్చేరిల్లో కూడా బుధవారం కొన్నిచోట్ల హిజాబ్‌ గొడవలు తలెత్తాయి. కోల్‌కతాలో ఆలియా వర్సిటీ విద్యార్థులు హిజాబ్‌కు మద్దతుగా ర్యాలీ జరిపారు. 
 

సంబంధింత వార్త: Karnataka Hijab Row: హిజాబ్‌ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే..

చదవండి: హిజాబ్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement