హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా? | High Court Sensational Orders To Andhra Pradesh Judges | Sakshi
Sakshi News home page

హైకోర్టు జోక్యంతోనైనా అరాచకాలు తగ్గుతాయా?

Jul 9 2025 10:31 AM | Updated on Jul 9 2025 11:36 AM

High Court Sensational Orders To Andhra Pradesh Judges

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానానికి అభినందనలు. రెడ్‌బుక్‌ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అరాచకాలకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీకి ముకుతాడు వేసే దిశగా న్యాయస్థానం మేలైన చర్య తీసుకుంది. సోషల్‌మీడియా పోస్టుల విషయంలో అరెస్ట్‌ అయిన వారికి రిమాండ్‌ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, పౌరుల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్లకు జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు పోలీసు అధికారుల ఇష్టారాజ్య పోకడలకు కొంతమేర బ్రేక్‌ వేసింది. 

హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్‌ ప్రకారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు ఇకపై యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బీఎన్‌ఎస్‌ సెక్షన్ల హేతుబద్ధతలను పరిశీలించిన తర్వాతే రిమాండ్‌పై చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పెట్టుకోవాలి. ఏడేళ్ల లోపు శిక్ష పడే  కేసులలో రిమాండ్ అవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. 

ఇటీవలి కాలంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు కొందరు అవసరమున్నా లేకపోయినా పోలీసులు మోపిన కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పంపుతున్న విమర్శలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు అప్పుడప్పుడు రిమాండ్‌ తీరుతెన్నులను తప్పుపడుతున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో హైకోర్టు ఈ సర్క్యులర్‌ జారీ చేసింది. దీనిని ఉల్లంఘిస్తే కోర్టు  ధిక్కరణ అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సర్క్యులర్‌కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం!

ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న  సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. లోకేష్ మరో అడుగు ముందుకేసి రెడ్‌బుక్ ఏదో ఘనకార్యమైనట్లు సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయన అపరిపక్వతను తెలియచేస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతూ వస్తున్నారు.

జర్నలిస్టులను  కూడా వదలి పెట్టుకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న  టీడీపీ జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై సైతం రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. సిద్ధార్థ్‌ కౌశల్ అనే ఐపీఎస్‌ ఈ రెడ్‌బుక్ పిచ్చి గోలతో తాను పని చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తల పట్టుకుంటున్నారు. 

అధికార పార్టీ కొమ్ము కాసే కొద్ది మంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధలను గాలికి వదిలి వేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టక్టర్లు, ఎస్పీలు 'నీవు ఫలానా కులం వాడివి కదా! అయినా వైఎస్సార్‌సీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నావు’ అని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే వారు ఏమి చేయగలుగుతారు? పద్దతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు  పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు తాము వేధించామనే బయట చెప్పండని నిందితులతో అంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. 

రిమాండ్‌ విషయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలని హైకోర్టు సర్క్యులరైతే పంపింది కానీ... మెజిస్ట్రేట్లు దీని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా? లేదా?అన్న చర్చ ఉంది. ఎందుకంటే మెజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే  సెక్షన్ల ఆధారంగా రిమాండ్‌కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిధిలోకి రాకుండా, అవసరం ఉన్నా, లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులుపెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని భావిస్తే,  సంబంధం ఉన్నా, లేకపోయినా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. కొందరు మెజిస్ట్రేట్లు ఈ విషయాన్ని గుర్తించి ఆయా సెక‌్షన్లను తీసి వేయిస్తున్నా, అన్ని సందర్భాల్లోనూన  అలా చేయగలుగుతారా? అన్నదానిపై  ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. 

అయితే  హైకోర్టు సూచనలతో మెజిస్ట్రేట్లు సోషల్ మీడియా, తదితర భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలోనైనా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ముందు లోకేశ్‌ రెడ్‌బుక్ అంటూ తిరుగుతుంటే, అదేదో పిచ్చిగోలలే! తెలిసి, తెలియని మాటలులే అని అంతా అనుకున్నారు. కాని కూటమికి అధికారం రాగానే అదే ప్రమాదకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్‌బుక్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ఒక టాక్‌! అయినా తన కుమారుడిని నియంత్రించలేక పోతున్నారని చెబుతున్నారు. 

పోలీసు అధికారులు కూడా సీఎం కంటే మంత్రి లోకేశ్‌ మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై ఒకటికి పది చోట్ల కేసులు పెట్టి వేధించడం, ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారంట్ల పేరుతో ఇంకో కేసులో అరెస్టు చేయడం వంటివన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే  ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుకు గాలి తోడైనట్లుగా ఈ రెడ్‌బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని   ఉవ్విళ్లూరుతున్న లోకేశ్‌ హుందాగా వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీ ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు. 

టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు. కాని న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పు  పట్టింది. జస్టిస్ శ్రీనివాస రెడ్డి కోర్టులోనే తన  ఆవేదనను వ్యక్తపరిచారు.అయినా టీడీపీ తన ధోరణి మార్చుకుంటుందా?లేదా?అన్నది చెప్పలేం. ఎందుకంటే  చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వ హననం అన్నది తెలుగుదేశం పార్టీలో ఒక విధానంగా మారింది.

 టీడీపీ మీడియా అండగా ఉంటోంది. ఇతర పార్టీల వారి సంగతెందుకు! చివరికి 1995లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును సైతం వదలి పెట్టకుండా దారుణమైన కథనాలు ప్రచారం చేశారు. ఒకవైపు నీతులు చెప్పడం, మరో వైపు ఇలా ఎదుటి వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ వ్యూహంగా  మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.

::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement