అమరీందర్‌ నిబద్ధతపై సందేహం: రావత్‌

Harish Rawat says Amarinder under some kind of pressure - Sakshi

డెహ్రాడూన్‌/చండీగఢ్‌: బీజేపీకి చెందిన అమిత్‌షా తదితర నేతలతో మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మంతనాలు జరుపుతుండటంపై పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి హరీశ్‌ రావత్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు అమరీందర్‌ లౌకికతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు.

సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని నాయకులతో అంటకాగవద్దనీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వానికే మద్దతు ఇవ్వాలని కెప్టెన్‌ను రావత్‌ కోరారు. బీజేపీ వలలో పడవద్దని హితవు పలికారు.  పంజాబ్‌ కాంగ్రెస్‌కు మూడు సార్లు అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి పార్టీ అవమానించిందని భావించడం సరికాదని చెప్పారు. ఆయనకు ఎటువంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. సీఎంగా విద్యుత్, డ్రగ్స్‌ వంటి కీలకమైన అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కెప్టెన్‌ విఫలమయ్యారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సహా తనకు ఎవరి సలహా అక్కర్లేదన్న అహంభావంతో వ్యవహరించారని ఆరోపించారు.  

స్పందించిన కెప్టెన్‌
తన నిబద్ధతపై హరీశ్‌రావత్‌ సందేహాలు వ్యక్తం చేయడంపై కెప్టెన్‌ అమరీందర్‌ తీవ్రంగా స్పందించారు. తన బద్ధశత్రువులు, తీవ్రంగా విమర్శించే వారు సైతం లౌకికత విషయంలో తనను అనుమానించలేరన్నారు. ఇన్నేళ్లుగా విశ్వాసంగా పనిచేసిన తనకు ఆ పార్టీలో గౌరవం లేదని ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సిద్దూ నేతృత్వంలోని తిరుగుబాటుదారులకు మద్దతు పలకడంతోపాటు తనను విమర్శించే స్వేచ్ఛ ఇచ్చారన్నారు.  ‘సీఎల్‌పీ సమావేశంలో నన్ను దాదాపుగా తొలగించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ అవమానం పొందడం ఇష్టంలేక ముందుగానే వైదొలిగాను. ఇది అందరికీ తెలిసిన విషయమే’అని ఆయన తెలిపారు. వాస్తవాలిలా ఉంటే, హరీశ్‌రావత్‌ మాత్రం ఇందుకు విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top