ఏ హోదాలో ‘డిక్లరేషన్‌’ ఇచ్చారు?

Harish Rao Fires on Rahul Gandhi Warangal Declaration - Sakshi

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేని అసమర్థుడు రాహుల్‌ 

బీజేపీది పార్లమెంట్‌లో ఒక మాట.. పాలమూరులో ఇంకో పాట 

రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట అర్బన్‌: కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ఏ హోదాలో ప్రకటించారో అర్థం కావడం లేదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో హామీలు అమలవుతున్నాయా అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల శివారులోని పోలీస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మెజార్టీ ఇచ్చి.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా వాటిని నిలబెట్టుకోలేని అసమర్థుడైన రాహుల్‌.. టీఆర్‌ఎస్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు చెప్పులు మోసిన వారిని పార్టీలో పెట్టుకొని.. తెలంగాణ గడ్డపై.. తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ పార్టీపై పోరాడలేని అసమర్థ పార్టీగా కాంగ్రెస్‌ మారిపోయిందని విమర్శించారు. బీజేపీ నాయకులకు నిజం మాట్లాడితే తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుందని, అందుకే అబద్ధమే మాట్లాడుతుంటారని ఆరోపించారు. పాలమూరు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివిపోయారని.. బీజేపీ మంత్రులు, నాయకులకు మధ్య ఉన్న సమన్వయ లోపం బయటపడిందని అన్నారు.  

ఎవరు వస్తారో రండి.. 
‘కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీరు రాలేదని, ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. మేమే ఖర్చులు భరించి జేపీ నడ్డాను రాష్ట్రమంతా తిప్పుతాం. 33 జిల్లాల్లో 20 జిల్లాల ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను కాళేశ్వరం తీరుస్తోంది. ఎవరు వస్తారో రండి.. నిజానిజాలు తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పను.. మా సిద్దిపేట రైతులే చెబుతారు. మీ రాష్ట్ర నాయకులు అక్కసుతో రాసిచ్చిన స్క్రిప్టును చదివి అభాసుపాలు కావడం కన్నా గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకొని మాట్లాడితే ఢిల్లీ నాయకులకు గౌరవంగా ఉంటుంది. కేంద్ర మంత్రి గడ్కరీ కాళేశ్వరం ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం అవుతోందని, దేశానికి గ్రోత్‌ ఇంజిన్‌గా తెలంగాణ మారిందని ప్రశంసిస్తే నడ్డా అడ్డదిడ్డంగా మాట్లాడారు.

సాక్షాత్తు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌.. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలు జరగలేదని పార్లమెంట్‌లో చెప్పారు. ఇది బీజేపీ నేతలు గుర్తు తెచ్చుకోవాలి. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నామని అంటున్నారు. ఇంతకంటే అధ్వానమైన ఆత్మవంచన మరొకటి లేదు. నిధులు ఇవ్వకపోగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన అప్పులను ఆపుతూ, ఆర్‌బీఐని ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రగతిని కేంద్రం అడ్డుకుంటోంది. అధికారంలోకి రాగానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తామని పాలమూరులో 2014 ఎన్నికల సభలో మోదీ చెప్పారు. మరి ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి’అని హరీశ్‌ ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top