కాంగ్రెస్‌ నేతలపై ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు

Gulam Nabi Azad Comments On Congress Party Leaders - Sakshi

కాంగ్రెస్‌కు అధికారం కష్టమే : ఆజాద్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఘోర పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో రోజుకో కొత్త సమస్య వచ్చిపడుతోంది. ఇప్పటికే ప్రజల్లో ప్రాభల్యం కోల్పోతూ నానాటికీ కృషించి పోతున్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలో సీనియర్ల నిరసన స్వరాలు మరింత తలనొప్పిగా మారియి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తీరుపై కేంద్రమాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. నాయకత్వ తీరులో మార్పులు రాకపోతే ఇక ఎప్పటికీ కాం‍గ్రెస్‌ పార్టీని విజయవంరించదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు హస్తం పార్టీలో పుట్టించిన వేడి చల్లారకముందే మరోనేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన కేంద్రమాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 5స్టార్‌ సాంప్రదాయం ఎక్కువగా పెరిగిపోయిందని, నేతలు ప్రజల్లో కన్నా ఏసీ రూముల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. (కాంగ్రెస్‌ పార్టీని వదిలిపోండి)

ఆదివారం ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘ పార్టీలో ఇంతకుముందు ఉ‍న్న పరిస్థితులు ఇప్పడు లేవు. నాయకుల్లోచాలా మార్పులు వస్తున్నాయి. పార్టీ టికెట్‌ రావడమే ఆలస్యం 5 స్టార్‌ హోటల్స్‌లో ప్రత్యక్షమవుతున్నారు. ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఏమాత్రం పోరాటం చేయకుండా కేవలం ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేయగానే ఇక తమ పని పూర్తి అయ్యిందనే భ్రమలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం కష్టం. ఈ తీరు వెంటనే మార్చుకోవాలి. జాతీయ నాయకత్వం కిందస్థాయి నేతలకు ఆదర్శంగా ఉండాలి. (లేఖ: యూపీ కాంగ్రెస్‌ నేతపై చర్యలు!?)

గతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని పటిష్టస్థితికి చేర్చగలిగాను. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురాగలిగాను. ఆ సమయంలో పార్టీ ఇంఛార్జికి పూర్తి అధికారాలు ఉండేవి. అధిష్టానం ఎలాంటి విషయాల్లోనూ జోక్యం చేసుకునేది కాదు. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. 7 స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు రాబట్టడంతోనే అధికారంలోకి వచ్చాయు. ఏపీలో వైఎస్సార్‌ నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. ఆ తరువాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం రావాలంటే నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లాలి. లేకపోతే ఎప్పటికీ అధికారంలోకి రాలేము.

కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. పార్టీని పునాదుల నుంచి పునర్నిర్మించాలి. అధ్యక్షుడెవరని అడిగితే రెబెలియన్‌ అంటూ ముద్ర వేశారు. కాంగ్రెస్‌ పార్టీలో రెబెలియన్‌ అంటూ ఎవరూ ఉండరు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు కనీసం విపక్ష నేత పోస్టు కూడా దక్కట్లేదు’ అని అన్నారు. ఆజాద్‌ వ్యాఖ్యలతో పలువురు నేతలు విభేదిస్తుండగా.. మరికొందరి ఏకీభవిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top