త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్‌.. బీజేపీకి కొత్త సవాల్‌!

Greater Tipraland Demand In Tripura Before Assembly Elections - Sakshi

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రేటర్‌ టిప్రాల్యాండ్‌ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం వేడెక్కుతోంది. ఒకప్పుడు త్రిపురని ఏలిన మాణిక్య వంశానికి చెందిన ప్రద్యోత్‌ మాణిక్య డెబ్బార్మాన్‌కు చెందిన టిప్రా మోతా పార్టీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది.  ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ చేస్తున్న సంస్థలన్నీ కలిసి టిప్రా ఇండీజెనస్‌ ప్రోగ్రసివ్‌ రీజనల్‌ అలయెన్స్‌ (టిప్రా మోతా)గా ఏకతాటిపైకి వచ్చారు. ఇన్నాళ్లూ సామాజిక సంస్థగా ఉన్న ఈ కూటమి, రాజకీయ పార్టీగా రూపొంతరం చెందింది. అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన వారితోనే తాము పొత్తు పెట్టుకుంటామని ప్రద్యోత్‌ తేల్చి చెబుతూ అధికార బీజేపీకి సవాల్‌ విసురుతున్నారు. 

ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న గిరిజనులు, స్థానిక తెగల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకి మద్దతుగా ఉంటూ గత రెండేళ్లలోనే ఢిల్లీ వేదికగా ప్రద్యోత్‌  ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేశారు. గత వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్‌ షాతో ప్రద్యోత్‌ నేతృత్వంలోని టిప్రా మోతా ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి చేసిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రద్యోత్‌ తాము ఒంటరిపోరాటానికి సిద్ధమై 35 నుంచి 40 సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం అంశం అత్యంత ప్రభావం చూపించబోతోంది.  

ఏమిటీ గ్రేటర్‌ టిప్రాల్యాండ్‌ ? 
1949లో త్రిపురభారత దేశంలో విలీనం అవడానికి అంగీకరించింది. అప్పటికే తూర్పు బంగ్లాదేశ్‌ నుంచి త్రిపురలోకి భారీగా బెంగాలీల తాకిడి మొదలైంది. 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన యుద్ధం సమయంలో కూడా బెంగాలీ శరణార్థులు భారీగా వచ్చి చేరారు. ఫలితంగా స్థానికంగా నివసించే గిరిజనులు మైనార్టీలో పడిపోయారు. 1881లో 63.77శాతం ఉండే గిరిజనుల జనాభా 2011 నాటికి 31.80శాతానికి పడిపోయింది. 2011 నాటి భాషాపరమైన జనాభా లెక్కల ప్రకారం త్రిపుర మొత్తం జనాభా 36.74 లక్షలైతే, వారిలో బెంగాలీ మాతృభాష కలిగిన వారి సంఖ్య ఏకంగా 24.14 లక్షలు. స్థానిక ఆదివాసీల మాతృభాష కొక్‌»ొరాక్‌ మాట్లాడేవారు 8.87 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే బయట నుంచి వలస వచి్చన బెంగాలీలే వీరి కంటే మూడు రెట్లు ఎక్కువ. దాంతో స్థానికంగా ఉండేవారి హక్కులు, సంస్కృతి సంప్రదాయాలు, భూమిపై హక్కులు ప్రమాదంలో పడ్డాయి. దాంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ పుట్టింది.  

ఏయే ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం  
త్రిపురలో గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటితో 1985లో త్రిపుర ట్రైబల్‌ ఏరియాస్‌ అటానమస్‌ డి్రస్టిక్ట్‌ కౌన్సిల్‌ (టీటీఏఏడీసీ) ఏర్పాటైంది. రాష్ట్ర వైశాల్యంలో మూడింట రెండువంతుల్లో విస్తరించింది. గిరిజన తెగల హక్కులు, సంస్కృతి కాపాడడం కోసం ఏర్పాటైన టీటీఏడీసీకి శాసన, కార్యనిర్వాహక అధికారాలున్నాయి. టీటీఏఏడీసీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌ ఉంది.

ఎప్పట్నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌?  
2000 సంవత్సరంలో ఏర్పాటైన ఇండిజెనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) పార్టీ తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై గళమెత్తింది. రెండేళ్ల తర్వాత ఐపీఎఫ్‌టీ గిరిజనుల మరో పార్టీ త్రిపుర ఉపజాతి జ్యూబా సమితి(టీయూజేఎస్‌)లో విలీనమై నేషనలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ట్విప్రా (ఐఎన్‌పీటీ)గా ఆవిర్భవించింది. వేర్పాటు వాద నాయకుడు బిజోయ్‌ కుమార్‌ హరంగ్‌ఖ్వల్‌ నేతృత్వం వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్దగా ముందుకు వెళ్లకపోవడంతో 2009లో ఎన్‌సీ డెబ్రామా ఆధ్వర్యంలో మళ్లీ ఐపీఎఫ్‌టీను పునరుద్ధరించారు.  ˘

ఎన్నికల్లో ప్రభావం ఎంత?
మొత్తం 60 శాసనసభ స్థానాలున్న రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఆశిస్తున్న ఆదివాసీలు 20 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరు. ఇప్పటివరకు ఐపీఎఫ్‌టీయే ఈ నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా ఉంది. త్రిపురలో అద్భుతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వివిధ స్థానిక పార్టీలతో జత కలిసింది. దీంతో ఈ ప్రాంతంలోని 20 స్థానాలకు గాను  బీజేపీ 10సీట్లు, ఐపీటీఎఫ్‌ 8 ,, సీపీఐ(ఎం) రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. మాణిక్‌ సర్కార్‌ ఓటమికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణంగా మారింది. 

ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్రం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ఐపీటీఎఫ్‌ ఎన్నికల తర్వాత అధికార బీజేపీలో చేరింది. ఆ పార్టీ నాయకుడు ఎన్‌సీ డెబర్మా మంత్రిగా కూడా పని చేసి 2022 జనవరి 1న కన్నుమూశారు. గిరిజన హక్కుల మండలి (టీటీఏఏడీసీ)కి 2021 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో టిప్రా మోతా పార్టీ 28 స్థానాల్లో పోటీ చేస్తే 18 నెగ్గింది. ప్రస్తుత అసెంబ్లీలో 36 స్థానాలతో ఉన్న అధికార బీజేపీ,  16 స్థానాలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న సీపీఐ(ఎం) ఉంటే, ఐపీటీఎఫ్‌ ఎనిమిది స్థానాలను నెగ్గింది. టిప్రా మోతా ఒంటరిపోరాటానికి సిద్ధమై అధికార బీజేపీకి వణుకు పుట్టిస్తున్నారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top