‘ఎవరు కావాలి నేమ్‌ చేంజర్సా.. గేమ్‌ చేంజర్సా?’ | GHMC Elections 2020 KTR Slams BJP In Real Estate Summit | Sakshi
Sakshi News home page

‘ఎవరు కావాలి నేమ్‌ చేంజర్సా.. గేమ్‌ చేంజర్సా?’

Nov 27 2020 7:30 PM | Updated on Nov 28 2020 8:00 AM

GHMC Elections 2020 KCR Slams BJP In Real Estate Summit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని కూడా డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేస్తాం.. దీనివల్ల డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరగవు, మోసాలు ఉండవు అన్నారు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌. జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘నేను వచ్చింది మీ మద్దతు కోసం. ఆరేళ్ల క్రితం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. మేం అధికారంలోకి వచ్చే నాటికి రియల్ ఎస్టేట్ ఎలా ఉందో అందరికి తెలుసు. ఆరేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశాం. ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు పోయాం. పెద్ద సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. మీ‌ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాను. మీ సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాను. తెలంగాణలో భూముల డిజిటల్ సర్వే చేస్తాం. దీన్ని మిగతా రాష్ట్రాలు కాపీ కొడతాయి’ అన్నారు కేటీఆర్‌. 

‘ఒకప్పుడు శివారు ప్రాంతాల్లో పదిహేను రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఒకరోజు తప్పించి మరో రోజు వస్తున్నాయి. నాలా, మూసీ, డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన‌ చేస్తాం. హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమరాలు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ని కూడా అదుపులో ఉంచాం. నేడు తెలంగాణ-ఆంధ్రా,  హిందూ-ముస్లిం గొడవలు లేవు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవు. కానీ మా రాజకీయ ప్రత్యర్థులు మాటలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఒకాయన సర్జికల్ స్ర్టైక్ గురించి మాట్లాడుతారు. హిందూ-ముస్లింల‌ మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గడిచిన ఆరేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. అమిత్ షా లక్ష కోట్లు ఇచ్చామంటారు. మాకిచ్చేవే ఇచ్చారు కదా. ఇంకా కేంద్రమే తెలంగాణకు  బాకీ ఉంది. సర్జికల్ స్ర్టైక్ చేస్తామని అంటున్నారు.. ఎవరి మీద చేస్తారు. ఇలాంటి మాటలు ఏంటి?. ఒక మతాన్ని టార్గెట్ చేయడం పద్దతా.. మత ఘర్షణలుంటే పెట్టుబడులు వస్తాయా’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. (చదవండి: ఇచ్చిన హామీలు.. పెట్టిన ఫొటోలు మావే!)

బీజేపీ వాళ్లు హైదరాబాద్ పేరు మారుస్తా అంటున్నారు. హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారిస్తే ఏం అవుతుంది. నేమ్ చేంజర్స్ కావాలా గేమ్ చేంజర్స్ కావాలో ఆలోచించండి. అభివృద్ధితో కూడిన హైదరాబాద్ కావాలో.. కర్ఫ్యూతో కూడిన‌ హైదరాబాద్ కావాలో ఆలోచించుకోవాలి. కేంద్రమంత్రులు కూడా ప్రచారానికి వస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు ఎవరు కనపడలేదు. వాళ్లకు హైదరాబాద్ బిర్యాని తినిపిద్దాం.. ఇరానీ చాయ్ తాపిద్దాం. ఆరేళ్లలో తెలంగాణకు కేంద్రం ఒక్క పైసా పనిచేయలేదు. మనల్నే కాదు ఏపీని కూడా బీజేపీ మోసం చేసింది. కరోనా సమయంలో ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు. ఎక్కడికి పోయాయో చెప్పాలి. నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు. పెట్టుబడులు కావాలంటే దమ్మున్న లీడర్ కావాలి. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం పెరగాలి. ప్రతి ఒక్కరు ఓటేయాలి. ఓటేయనివారికి ప్రశ్నించే హక్కు లేదు’ అన్నారు కేటీఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement