సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాం: గంగుల

Gangula kamalakar Comments In Huzurabad Over TRs Party - Sakshi

అభివృద్ధి, సంక్షేమం మా బాధ్యత

ఉద్యమంలో మేమూ పాల్గొన్నాం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

సాక్షి, కరీంనగర్‌: పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని, పనిచేసే వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం పార్టీలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిందేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం మీ సేవా కార్యాలయంలో హుజూరాబాద్‌ నియోజక వర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి పార్టీని వీడేది లేదని, సీఎం కేసీఆర్‌ బొమ్మ మీద గెలిచామని, జెండా ఏజెండా లేని ఈటల వెంట వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజక వర్గానికి చెందిన మెజార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీ వైపే ఉన్నారని, కన్నతల్లి లాంటి పార్టీని వీడేది లేదని చెబుతున్న కార్యకర్తల ధైర్యం ఉత్సాహాన్నిస్తుందని అన్నారు.

ఆత్మగౌరవం అంటూ సరికొత్త నాటకంతో ప్రజల ముందుకు వస్తున్న నాయకులను నమ్మవద్దని, కేసీఆర్‌ నాయకత్వంలోనే సమిష్టిగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని తనను విమర్శిస్తున్న వారు తమ తీరు మార్చుకోవాలని జిల్లా కేంద్రంలో జరిగిన ఉద్యమంలో తాను పాల్గొన్నానని, తనపై కేసులు సైతం నమోదయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీఎస్‌ చైర్మన్‌ చిరుమల్ల రాకేశ్, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు పేర్యాల రవీందర్‌రావు, పొనగంటి మల్లయ్య, తదితరులు ఉన్నారు. సోమవారం మంత్రి గంగుల కలిసిన వారిలో హుజురాబాద్, జమ్మికుంట పీఏసీఎస్‌ చైర్మన్లు ఎడవెల్లి కొండల్‌రెడ్డి, పొనగంటి సంపత్,  కమలాపూర్‌ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రాసేనరెడ్డి, గోపాల్‌పూర్, శనిగరం, మరిపల్లి గూడెం, మాదన్నపేట్, అంబాల, చేల్పూర్, జూపాక గ్రామాల  సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

చదవండి:
2023 తర్వాత నువ్వు అధికారంలో ఉండవు: ఈటల
గంగుల vs ఈటల.. ఎవరి బలమెంత?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top