2023 తర్వాత నువ్వు అధికారంలో ఉండవు: ఈటల

Former Minister Eatala Rajender Fires On Gangula Kamalakar - Sakshi

మంత్రి గంగుల కమలాకర్‌పై తీవ్ర ఆగ్రహం

కరీంనగర్‌: ప్రస్తుతం రాష్ట్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మంత్రి గంగుల కమలాకర్‌ మధ్య వివాదం నడుస్తోంది. వీరిరువురి మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ గంగుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై కక్షతో గోదాములు, పౌల్ట్రీని సీజ్‌ చేయవద్దని.. ప్రజలను వేధించవద్దని మంత్రికి హితవు పలికారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా వచ్చే నాయకులు ఏనాడైనా సర్పంచ్‌, జెడ్పీ, ఎంపీటీసీల గెలుపులో సహాయం చేశారా? తోడ్పాటు అందించారా? అని ప్రశ్నించారు. గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ఈటల మంత్రి గంగులపై ధ్వజమెత్తారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ ఈటలకు సవాల్‌ విసిరారు. మంగళవారం హుజుర్‌నగర్‌లో ఈటల మాట్లాడగా.. మంత్రి కరీంనగర్‌లో మాట్లాడారు. 

‘2023 తర్వాత అధికారంలో ఉండవు’: ఈటల
హుజుర్‌నగర్‌లో మంగళవారం ఈటల రాజేందర్‌ తన అనుచరులు, అభిమానులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కరీంనగర్‌ ప్రజలు చల్లగా చూడమని గంగులను గెలిపించారు. హుజూరాబాద్‌పై పడి బెదిరించమని కాదు. బిల్లులు రావు, పనులు జరగవు, గ్రామానికి రూ.50 లక్షలు కావాలంటే.. మాతో ఉండాలని ఒత్తిడి చేసి, బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేయడం సరికాదు. మంత్రులు కాకముందు సంస్కారం లేకపోతే ఫర్వాలేదు, మంత్రి అయ్యాకైనా నేర్చుకోవాలి. అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం అనుకుంటే భ్రమలో ఉన్నట్లే. ప్రజలను చిన్నచూపు చూసిన వారికి భవిష్యత్‌లో అదే గతి పడుతుంది. కరీంనగర్‌ జిల్లాలో ఎన్ని గుట్టలు మాయమై బొందలగడ్డగా మారాయో.. ఎన్ని కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టావో తెలుసు. 2023 తర్వాత నువ్వు.. నీ అధికారం ఉండదు’ అని మండిపడ్డారు.

రాజీనామా చేయ్‌: మంత్రి సవాల్‌
‘ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరు. హుజూరాబాద్‌ ప్రజలు ఈటల వెంటే ఉంటే ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఈటల రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి’ అని మంత్రి గంగుల కమలాకర్‌ సవాల్‌ విసిరారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అని చెప్పారు. పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదురెట్లు అధికంగా చెల్లిస్తానని ప్రకటించారు. అసైన్డ్‌ భూముల విషయంలో ఈటలను దోషిగా తేల్చారు అని చెప్పారు. ఈటల ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములను తిరిగిచ్చేయాలి అని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top