EX TDP S Kota MLA Shobha Hymavathi Resigns To Party: Check Details - Sakshi
Sakshi News home page

విజయనగరం: కుప్పకూలిన టీడీపీ ‘కోట’

Jul 18 2021 8:46 AM | Updated on Jul 18 2021 5:58 PM

Former MLA Shobha Haimavathi Resigns To TDP - Sakshi

విజయనగరం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలుచుకోలేక కుదేలైన టీడీపీకి ఇప్పుడు మరో చావుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన శోభా హైమావతి పార్టీకి శనివారం రాజీనామా చేశారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలుచుకోలేక కుదేలైన టీడీపీకి ఇప్పుడు మరో చావుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన శోభా హైమావతి పార్టీకి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు ఆమె వెల్లడించారు. దీంతో ఎస్‌.కోట నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న కాస్తంత బలం కూడా కరిగిపోయింది. ఇటు జిల్లాలో అటు విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కీలకమైన శృంగవరపుకోటలో టీడీపీకి గట్టి నాయకత్వమే లేకుండా పోయింది.

మారుమూల గ్రామం నుంచి... 
హైమావతి స్వస్థలం విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని భీమవరం గ్రామం. ఆమె భర్త  అప్పలరాజు హిందుస్థాన్‌ షిప్‌యార్డులో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆమె కుమార్తె శోభా స్వాతిరాణి బ్యాచలర్‌ ఆప్‌ డెంటల్‌ సర్జరీ (బీడీఎస్‌) పూర్తిచేశారు. 2014 నుంచి 2019 వరకూ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. హైమావతి ఇద్దరు కుమారులూ బీటెక్‌ పూర్తి  చేశారు.

రాజకీయాల్లో కీలక స్థానానికి... 
జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఒకప్పుడు జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దివంగత నాయకుడు లగుడు సింహాద్రి హైమావతికి రాజకీయ గురువు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో  ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన శృంగవరపు కోట నుంచి టీడీపీ అభ్యర్థిగా హైమావతి తొలిసారి పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామిపై 678 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఓడిపోయింది. అప్పుడే కాంగ్రెస్‌ అభ్యర్థి కుంబా రవిబాబు చేతిలో 5,862 ఓట్ల తేడాతో హైమావతి ఓటమి పాలయ్యారు. తర్వాత ఏపీఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌గా సేవలు అందించారు. టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

పార్టీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. అనకాపల్లి, విశాఖ, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2009 నాటి ఎన్నికల్లో అరకు, ఎస్‌.కోట నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జిగా పనిచేశారు. జిందాల్‌ భూముల వ్యవహారంపై అలుపెరుగని పోరాటం చేశారు. ఆ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. మృధుస్వభావి అయిన ఆమె పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ కీలక నేతగా ఎదిగారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్‌.కోట జనరల్‌ సెగ్మెంట్‌ అయింది. ఉత్తరాపల్లి నియోజకవర్గం రద్దు అయ్యింది.

దీంతో చంద్రబాబు ఎస్‌.కోట నియోజకవర్గాన్ని ‘కోళ్ల’ కుటుంబానికి కేటాయించారు. తదుపరి పరిణామాల్లో హైమావతి కుటుంబాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పార్టీలో ప్రాధాన్యం క్రమేపీ తగ్గిపోయింది. పార్టీ పదవుల నుంచి దూరం చేశారు. టీడీపీ వైఖరిని భరించలేక చివరకు ఆమె ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. ఎస్‌.కోటలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement