
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్‌బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.