సీఎం కేసీఆర్‌ సంచలనం: ఈటల బర్తరఫ్‌ 

Etela Rajendar Exists Frome Telangana Ministry - Sakshi

మంత్రివర్గం నుంచి తొలగించాలనే సీఎం సిఫారసుకు గవర్నర్‌ ఆమోదం 

చట్టాల ఉల్లంఘన పేరిట మరిన్ని చర్యలకు అవకాశం? 

తొందరపడకుండా వేచిచూసే ధోరణిలో ఈటల 

సాక్షి, హైదరాబాద్‌: ఈటల రాజేందర్‌పై వేటు పడింది. ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ నివేదిక పంపిన నేపథ్యంలో.. ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంటూ గవర్నర్‌ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.  భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను శనివారం ముఖ్యమంత్రికి బదలాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం సాయంత్రం భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలో ఈటల మంత్రివర్గం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటారా? లేక బర్తరఫ్‌ చేసేంత వరకు వేచి చూస్తారా? అనే ఉత్కం ఠ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్‌కు గవర్నర్‌ కార్యాలయం ముగింపు పలికింది. ఇప్పటికే వివాదాస్పద భూమిలో అధికారులు బోర్డులు పాతగా, కేవలం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌తో సరిపెట్టకుం డా వివిధ చట్టాల ఉల్లంఘనను కారణంగా చూపు తూ ఆయనపై మరిన్ని చర్యలకు కూడా ప్రభుత్వం ఆదేశించే అవకాశమున్నట్లు సమాచారం.  

రెండోరోజూ అదే సీన్‌.. 
ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో రోజు ఆదివారం కూడా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కుల సంఘాల నేతలు కూడా వచ్చి తమ సంఘీభావం తెలియజేశారు. ‘మేము మీ వెన్నంటి ఉంటాం’అని నియోజకవర్గంలోని కేడర్‌ స్పష్టం చే సినట్లు సమాచారం. వివిధ సంఘాల నేతలు మా త్రం ఏదో ఒక రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూ డా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు, పార్టీలో కొనసాగుతూ తాడో పేడో తేల్చుకోవాలని మరికొందరు సూచించినట్లు తెలుస్తోంది.

అందరం కలిసి మాట్లాడుకుందాం.. 
తనను కలుస్తున్న వారందరికీ.. ‘వేచి చూద్దాం.. తొందర పడొద్దు’అంటూ ఈటల సమాధానం ఇస్తున్నారు. అందరమూ కూర్చొని మాట్లాడుకుం దామని చెబుతున్నారు. ఒకటీ రెండురోజుల్లో నియోజకవర్గ కేంద్రానికి వెళ్లేందుకు ఈటల సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. కార్యకర్తలతో సమావేశమై వారి నుంచి అభిప్రాయ సేకరణ జరపాలనే యోచనలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, శ్రేయోభిలా షులతోనూ భేటీ అయ్యే అవకాశముంది.

పార్టీలో నిశ్శబ్దం 
తెలంగాణ ఉద్యమ నేతగా, మంత్రిగా ఇన్నాళ్లూ పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఈటల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీఆర్‌ఎస్‌లో మౌనం రాజ్యమేలుతోంది. ఎవరూ దీనిపై మాట్లాడటం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను విమర్శిస్తూ శని, ఆదివారాల్లో మంత్రులు శ్రీనివాస్‌ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ వేర్వేరు ప్రెస్‌మీట్లు పెట్టినా ఈటల అంశం ప్రస్తావనకు రాకుండా చూసుకున్నారు. మరోవైపు హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు మినహా పార్టీ ఇతర నేతలెవరూ ఈటల ఇంటి దరిదాపులకు వెళ్లకపోవడం గమనార్హం. కేటీఆర్‌ను కాంటాక్ట్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు ఈటల చెప్పినా, ఇతర కీలక నేతలెవరూ ఆయనను కాంటాక్ట్‌ చేసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.   

చదవండి: ఊహించని షాక్‌.. 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం
చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top