
టోక్యో: జపాన్ దేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. తొలి మహిళా ప్రధానిగా 64 ఏళ్ల సనే తకైచి ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో తకైచి అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే మెజార్టీ సాధించి, అనూహ్య విజయం దక్కించుకున్నారు. అధికారాన్ని అందుకున్న వెంటనే తకైచి తనదైన పాలనకు శ్రీకారం చుట్టారు.
వలస విధానాలపై ప్రత్యేక దృష్టి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసదారులపై అనుసరిస్తున్న కఠిన విధానాలను తమ దేశంలోనూ అమలు చేసేందుకు జపాన్ నూతన ప్రధాని తకైచి నడుంబిగించారు. తన పరిపాలనలో కొత్తగా సామూహిక బహిష్కరణల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇది దేశ యుద్ధానంతర చరిత్రలో అత్యంత దూకుడుగా కనిపించే వలస విధానాలలో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని తకైచి ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా ఈ నూతనశాఖ ఏర్పాటుపై ప్రకటన వచ్చింది.
జపాన్ సరిహద్దుల భద్రతకు ప్రాధాన్యత
జపాన్‌లో నూతనంగా సామూహిక బహిష్కరణల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అనేది జాతీయవాద పాలనకు బలాన్నిచ్చేదిగా ఉండనుంది. ఈ నూతన మంత్రిత్వ శాఖ.. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులను, వలస చట్టాలను ఉల్లంఘించిన వారిపై దృష్టి సారించి, వారిని స్వదేశాలకు పంపే దిశగా పనిచేస్తుంది. ఈ నూతన శాఖ ఏర్పాటుపై ప్రకటన చేస్తున్నప్పుడు ప్రధాని తకైచి ‘జపాన్ సరిహద్దుల భద్రత- సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ నూతన మంత్రిత్వ శాఖ దేశ చట్టాలను గౌరవించేలా ఉంటుంది. అలాగే ఎటువంటి రాజీ లేకుండా దీనిని అమలు చేస్తామన్నారు.
ప్రతిపక్షాల నుంచి విమర్శలు
కాగా ప్రధాని తకైచి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు, పౌర హక్కుల సంఘాలు.. విదేశీ ద్వేషపూరిత చర్యగా, ప్రమాదకరమైన తిరోగమనంగా అభివర్ణించాయి. ఇది జపాన్‌కున్న ప్రపంచ ఖ్యాతిని దెబ్బతీస్తుందని, కీలక పరిశ్రమలలో కార్మికుల కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. దేశంలో తగ్గిపోతున్న శ్రామిక శక్తిని నిలబెట్టేందుకు విదేశీ కార్మికులు అవసరమని జపాన్ వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం అంతర్జాతీయ పెట్టుబడులను నిరోధిస్తుందని, పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.