ప్రవాసీల కోసం జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు

Establishment of a national political party for NRIs - Sakshi

బిజెపికి నంగి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్‌కు మంద భీంరెడ్డి రాజీనామా 

హైదరాబాద్: అంతర్గత, అంతర్జాతీయ వలసదారుల హక్కులు, సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం (సెప్టెంబర్ 13) ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలో పలు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపామని, లాక్ డౌన్ సమయంలో 45 కోట్ల మంది వలస కార్మికులు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లారని, ఒక కోటి యాభై లక్షల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తుండగా వారిలో 88 లక్షల మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారని ఆయన అన్నారు. 

స్వదేశంలో, విదేశంలో పనిచేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రవాసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దేవేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి వలస కార్మికుల జాతీయ వేదికల నిర్మాణం కోసం 'నేషనల్ నెట్ వర్క్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్', 'నేషనల్ ఫెడరేషన్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్' ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నంగి దేవేందర్ రెడ్డి బిజెపికి, మంద భీంరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రవాసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా తాము ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమ పార్టీలకు సోమవారం రాజీనామా చేసినట్లు వారు వివరించారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top