Aparna Yadav: అఖిలేష్‌కు దిమ్మతిరిగే షాక్‌.. బీజేపీలో చేరిన ములాయం చిన్న కోడలు

UP Election: Mulayam Singh Yadav Daughter In Law Aparna joins BJP - Sakshi

ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్న అపర్ణా యాదవ్‌

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతకొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ ములాయంసింగ్‌ యాదవ్‌ సవతి కుమారుడు (రెండో భార్య సాధనా సింగ్‌కు మొదటి వివాహం ద్వారా జన్మించారు) ప్రతీక్‌ యాదవ్‌ భార్య అయిన అపర్ణా యాదవ్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న అపర్ణా యాదవ్‌కు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌లు సభ్యత్వం అందించారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఓబీసీ వర్గాల్లో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ములాయం చిన్న కోడలు కాషాయ కండువా కప్పుకోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. 

చదవండి: రసవత్తరంగా యూపీ ఎన్నికల సమరం.. అసెంబ్లీ బరిలో అఖిలేష్‌

నియోజకవర్గమే సమస్య... 
2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్‌ సీటు నుంచి సమాజ్‌వాదీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన అపర్ణా యాదవ్, ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎస్పీ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. అయితే ఈసారి అపర్ణా యాదవ్‌కు టికెట్‌ ఇచ్చేందుకు అఖిలేశ్‌ సిద్ధంగా లేరు. ఈ స్థానం నుంచి ఎస్పీ యువనేత సౌమ్యభట్‌ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. లక్నోలో విద్యా సంస్థను నడుపుతూ, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన సౌమ్య, అఖిలేశ్‌తో పాటు ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌కు సన్నిహితురాలు. ఈ పరిస్థితుల్లోనే అపర్ణా యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దేశాన్ని ఆరాధించేందుకే తాను ఎస్పీ నుంచి బయటకు వచ్చానని, తన శక్తి మేరకు పార్టీ కోసం చేయగలిగినదంతా చేస్తానని అపర్ణా యాదవ్‌ పేర్కొన్నారు.మరోవైపు లక్నో కంటోన్మెంట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ మహిళా నేత రీటా బహుగుణ ఈసారి బీజేపీ టికెట్‌ తన కుమారుడిని బరిలోకి దింపాలని ఆశిస్తున్నారు.

చదవండి: తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top