తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 

Yogi Adityanath To Fight UP Polls From Stronghold Gorakhpur, Details Inside - Sakshi

గతంలో ఎంపీగా పోటీ చేసిన గోరఖ్‌పూర్‌ స్థానం నుంచి పోటీ

తూర్పు యూపీ నుంచి ఇద్దరు మంత్రుల రాజీనామా

నష్ట నివారణలో భాగంగా యోగి బరిలోకి

తూర్పు యూపీలోని 160 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కొల్లగొట్టేలా వ్యూహాలు 

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు అనాసక్తి చూపితే.. తొలిసారి ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రం కదనరంగంలో తేల్చుకునేందకు సిధ్దమయ్యారు. హిందూ, ధార్మిక భావజాలం ఉండే అయోధ్య లేక మథుర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయనను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగినా బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఆయన్ను తూర్పు యూపీలోని స్వస్థలమైన గోరఖ్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిపింది. గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో అక్కడే నుంచే ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  

నష్ట నివారణచర్యల్లో భాగంగానే..
అయితే యోగిని గోరఖ్‌పూర్‌ నుంచి పోటీ చేయించడానికి అనేక కారణాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతు న్నాయి. గోరఖ్‌పూర్‌ తూర్పు యూపీలో ఉంది. తూర్పు యూపీకి చెందిన ఇద్దరు కేబినెట్‌ మంత్రులు స్వామి ప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌లు ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. మౌర్య 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఖుషీనగర్‌ జిల్లా కేంద్రమైన పద్రౌనా నుంచి గెలుపొందగా, మవూ జిల్లాలో ఉన్న మధుబన్‌ నుండి దారాసింగ్‌ గత ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరూ స్థానికంగా బలవంతులు. సామాజికవర్గంపై బాగా ప్రభావం చూపుతారు.వీరి రాజీనామాతో పార్టీకి నష్టం కగిలే అవకాశాలున్నాయి.
చదవండి: రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..

గోరఖ్‌పూర్‌ నుంచి యోగి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఇక్కడ యోగిని నిలపడం ద్వారా సీట్లు తగ్గకుండా చూసుకోవడంతో పాటు, గోరఖ్‌పూర్‌ పొరుగు జిల్లాలైన బస్తీ, సిద్ధార్థనగర్, ఖుషీనగర్, మహరాజ్‌గంజ్, బలరాంపూర్, సంత్‌ కబీర్‌నగర్, డియోరియాలలో మద్దతును పెంచుకోవాలన్నది.  బీజేపీ వ్యూహంగా ఉంది. అదీగాక యోగి 1998, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో వరుస విజయాలను నమోదు చేసి, గోరఖ్‌పూర్‌ నుండి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా అ త్యంత ప్రజాదరణ పొందిన గోరఖ్‌నాథ్‌ మఠానికి అధిపతిగా ఉన్నారు. గోరఖ్‌పూర్‌ నుండి పోటీ చేయడం ద్వారా, యోగికి యూపీలోని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టడా నికి ఎక్కువ సమయం ఉంటుందని బీజేపీ అంచనా.

సీఎం అభ్యర్థులంతా పోటీకి దూరమే 
యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారపగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు దిగలేదు. శానమండలి సభ్యురాలిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ సైతం పార్లమెంట్‌కు గెలిచినా, 2012లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే బరిలో దిగలేదు. మండలి నుంచి ఎన్నికై సీఎంగా కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
చదవండి: Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా

ఆయన్ను అసెంబ్లీ బరిలో నిలిపే విషయమై అనేక తర్జనభర్జనలు జరిగాయి. ఒకవేళ పోటీలో నిలిపితే శ్రీకృష్ణ జన్మభూమి అయిన మథుర, రామ జన్మభూమి అయిన అయోధ్యల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ నిలుపుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ మూడ్రోజుల కింద ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో యోగికి గోరఖ్‌పూర్‌ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఒటమి భయంతోనే యోగీని తిరిగి సొంతింటికి పంపారని ఎస్పీ అప్పుడే ప్రచారాలు సైతం మొదలుపెట్టింది.  

మథుర, అయోధ్యకు దూరానికి భిన్న కారణాలు..
ఇక మథుర, అయోధ్యలో యోగిని పోటీ దిగకపోవడానికి పార్టీ వర్గాలు అనేక కారణాలను విశ్లేషిస్తున్నాయి. మథురలో ఇప్పటికే బీజేపీ నుంచి బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీకాంత్‌ శర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన శర్మ విద్యుత్‌ శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఆయన్ను పక్కనపెట్టి యోగికి టిక్కెట్‌ ఇవ్వడం అంటే బ్రాహ్మణ వర్గానికి కోపం తెప్పిచ్చినట్లే అవుతుంది. అదీగాక విద్యుత్‌ సంస్కరణలు తెచ్చామని చెబుతున్న ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రికే టిక్కెట్‌ నిరాకరించడం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వెనక్కి తగ్గారు. ఇక అయోధ్యలో బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్‌ గుప్తా ఎస్పీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి తేజ్‌ నారాయణ్‌ పాండేను 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. దీంతో ఆయనకు టిక్కెట్‌ నిరాకరించడం సాథ్యం కాదు. ఈ దృష్ట్యానే అయోధ్యలో పోటీపై వెనక్కి తగ్గారు.      

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top