ఆయనేమైనా రాజా? దేవుడా?.. ఇంత అతి చేస్తున్నారు

During Amit Shah Visit Ahmedabad Police Asks People To Shut Windows Objections Raised - Sakshi

‘ఐదు గంటలపాటు కిటికీలు మూసేయండి. మూడురోజుల పాటు మీ వ్యాపారాలు బంద్‌ చేయండి’ ఈ ఆదేశాలు జారీ చేసింది అహ్మదాబాద్‌ పోలీసులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అహ్మదాబాద్‌ రెండు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా కారణాలు చూపిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఆర్టీఐ యాక్టివిస్ట్‌ ఒకరు అభ్యంతరం చెప్పడంతో పోలీసుల అత్యుత్సాహం వెలుగులోకి వచ్చింది.

గాంధీనగర్‌:  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆది, సోమవారాల్లో అహ్మదాబాద్‌  పర్యటించారు. అయితే ఆయన పర్యటనకు ముందు వెజల్‌పూర్‌ పోలీసులు ఎస్సై ఒడెదర పేరుతో ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ఆదివారం ఉదయం ఓ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభానికి మంత్రి షా వస్తున్నారని, కాబట్టి, ఆ దగ్గర్లోని 300 ఇళ్ల కిటికీలన్నింటిని మూసేయాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. జె కేటగిరీ సెక్యూరిటీ నేపథ్యంలోనే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జులై 10న ఆ నోటీసులను ఐదు అపార్ట్‌మెంట్లకు, చుట్టుపక్కల ఇళ్లకు అంటించి తప్పనిసరిగా పాటించాలని మైకులో అనౌన్స్‌ చేశారు కూడా. 

అయితే వెజల్‌పూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న  పంక్తి జోగ్‌(44) అనే ఆవిడ అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని, కాబట్టి కిటికీలు తెరిచే ఉంచుతానని ఆమె స్టేషన్‌కు వెళ్లి మరీ పోలీసులకు స్పష్టం చేసింది. అంతేకాదు తనలాంటి వాళ్లు ఎందరో ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె పోలీసులతో వాదించింది.

నిజానికి ఆమె అభ్యంతరం అదొక్కటే ఒక్కటే కాదు. పంక్తి ఓ ఆర్టీఐ ఉద్యమకారిణి. షా పర్యటన నేపథ్యంలో పోలీసులు నిజంగానే అత్యుత్సాహం ప్రదర్శించారనేది ఆమె పాయింట్‌. మూడు రోజుల పాటు చిరువ్యాపారులను వ్యాపారాలు మూసేయాలని ఆదేశించారని, అలాగే మళ్లింపు పేరుతో వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలకు స్థానికులు కొందరు సైతం తోడవ్వడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

ఎస్సైపై చర్యలు?
‘మనం ప్రజాస్వామ్య బద్ధమైన దేశంలోనే ఉన్నామా? వీళ్లు మంత్రులా? రాజులా?. ఆయనేమైనా రాజా? దేవుడా? ఇంత అతి చేస్తున్నారు. కాదు కదా. జనాలు ఓట్లేస్తే గెలిచిన మంత్రి.. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఏంటి?. స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం సామాన్యులకు హక్కులు ఇచ్చింది’ అని ఆమె పోలీసుల ఎదుట వాదించింది. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేసింది. 

అయితే పోలీసులు మాత్రం తాము ప్రజల్ని బలవంతం చేయలేదని, ఆమె ఆరోపణల్లో నిజం లేదని చెబుతూనే సర్క్యులర్‌ గురించి మాట్లాడేందుకు ఎస్సై ఒడెదర నిరాకరించారు. ఇక ఈ వ్యవహారం మీడియా ద్వారా ఫోకస్‌లోకి రావడంతో అహ్మదాబాద్‌ కమిషన్‌ సంజయ్‌ వాస్తవ స్పందించారు. ఇలాంటి ఆదేశాలను చర్యలను ఉపేక్షించమని, దర్యాప్తు జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్‌ పోలీసులకు తమ నుంచి అలాంటి ఆదేశాలు ఏం జారీ కాలేదని కేంద​ హోం మంత్రి అమిత్‌ షా భద్రతా విభాగం వెల్లడించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top