నిజాలు దాచి.. నిందలు | Dissatisfaction within the TDP itself On Chandrababu Cheap Politics | Sakshi
Sakshi News home page

నిజాలు దాచి.. నిందలు

Sep 30 2020 4:22 AM | Updated on Sep 30 2020 4:22 AM

Dissatisfaction within the TDP itself On Chandrababu Cheap Politics - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా దానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నిత్యకృత్యంగా మారింది. ఏం జరిగిందనే కనీస ప్రాథమిక సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే ఆయన ఆగమేఘాలపై స్పందించడం.. దానికి రాజకీయ రంగు జోడించి వివాదం రాజేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, మతం రంగు, లేకపోతే కులం రంగు పులిమి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

ఉదాహరణకు..
► రెండ్రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి సోదరుడిపై జరిగిన దాడిని దళితులపై దాడిగా చిత్రీకరించారు. దీనిపై పార్టీ తరఫున నిజనిర్ధారణ కమిటీని వేసి నానా యాగీ కూడా చేశారు. కానీ, పోలీసుల విచారణలో దాడి చేసింది టీడీపీ నాయకుడని.. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ అనుచరుడని స్పష్టమైంది. 
► అలాగే, గత ఏడాది జూన్‌లో గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత తాడిబోయిన ఉమాయాదవ్‌ హత్య జరిగింది. నిజానిజాలు తెలుసుకోకుండా లోకేశ్, చంద్రబాబు వెంటనే వైఎస్సార్‌సీపీ నాయకులే ఈ హత్యచేశారని ఆరోపించారు. కానీ, పోలీసుల విచారణలో భూవివాదంతో టీడీపీ నేతలే ఈ హత్య చేసినట్లు తేలింది. 
► గత ఏడాది సెప్టెంబర్‌లో గుంటూరు జిల్లా ఆత్మకూరులో మామా, అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. దీన్ని వివాదం చేసి గ్రామాన్ని రెండుగా విడగొట్టి దళితుల మధ్య చిచ్చు రాజేశారు. గుంటూరులో వైఎస్సార్‌సీపీ బాధితుల పునరావాస కేంద్రం పెట్టి, ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చి దళితుల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. 
► ఇక మొన్న ఆగస్టులో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓంప్రతాప్‌ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందితే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల వేధింపులవల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని డీజీపీకి చంద్రబాబు లేఖ రాసి నానా రాద్ధాంతం సృష్టించారు. మృతుడి కుటుంబ సభ్యులు తమ వాడి మృతికి రాజకీయాలకు సంబంధంలేదని చెప్పినా చంద్రబాబు హంగామా చేశారు. 
► అంతేకాక.. ఇటీవల గుంటూరుకు చెందిన శివప్రసాద్‌ ఒక టీవీ చానల్‌లో పనిచేస్తూ ప్రభుత్వంపై తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఫిర్యాదులు వచ్చి పోలీసులు అతన్ని విచారించేందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు, లోకేశ్‌లు దీన్ని పోలీసుల కిడ్నాప్‌గా ప్రచారం చేశారు. చివరికి శివప్రసాద్‌ చేసిన తప్పు తెలుసుకున్నాక సైలెంట్‌ అయిపోయారు.
► ఇలా ఏడాదిగా చంద్రబాబు ప్రతి అంశానికీ రాజకీయం చేసి అభాసుపాలవుతున్నారు. తాను చేసింది తప్పని తెలుసుకున్న వెంటనే పరువు కాపాడుకునేందుకు బుకాయించడం లేదా వేరే విషయాన్ని లేవనెత్తడం ఆయనకు రివాజుగా మారిందనే అభిప్రాయం సాధారణ ప్రజలకు కూడా అర్ధమైపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement