
సాక్షి, విజయవాడ: ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్‌ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్‌తో వివాదం మరింత ముదిరింది. తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాసరావు.. బోర్డులు ఏర్పాటు చేశారు.

కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. కూల్చేసిన శిథిలాల కిందే శాతవాహన కాలేజీ విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని.. శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మండిపడుతోంది.
విద్యార్థుల పరిస్థితి ఏంటి?
శాతవాహన కాలేజీ భవనాలు కూల్చివేతతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కళాశాల భవనాలు కూల్చివేయడంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శాతవాహన కాలేజీకికు దశాబ్ధాల చరిత్ర ఉందని.. కోర్టు ఆదేశాలను సాకుగా చూపి కళాశాల భవనాలు కూల్చేయడం దారుణమన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సర్టిఫికెట్లు, రికార్డులన్నీ శిథిలాల కిందే ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి?. తక్షణమే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. విద్యార్ధులకు న్యాయం చేయాలి’’ అని రవిచంద్ర డిమాండ్ చేశారు.
