ఎంపీ కవిత పీఏలం.. అంతా చూసుకుంటాం..!

Delhi: TRS MP Maloth Kavitha Driver And Two Others Arrested For Extortion - Sakshi

మాలోత్‌ కవిత పీఏలమంటూ ఓ వ్యక్తికి టోకరా..

ఇంటిని కూల్చకుండా అడ్డుకుంటామంటూ రూ.5 లక్షల డిమాండ్‌

ఎంపీ ఇంటి ఆవరణలో రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు

ఢిల్లీలో తనకు పీఏలు ఎవరూ లేరని ఎంపీ కవిత వివరణ

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవిత పీఏలమంటూ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని న్యూగుప్తా కాలనీకి చెందిన మన్మీత్‌ సింగ్‌ లాంబా నివాసాన్ని ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) కూల్చేయనుందని, కూల్చకుండా చూసుకుంటామని లాంబాను నిందితులు సంప్రదించారు. ఎంసీడీలో ఓ అధికారి తెలుసని, ఇల్లు కూల్చకుండా ఉండేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ కవిత నివాసంలో గురువారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా, రెడ్‌ హ్యాండెడ్‌గా ముగ్గురు నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిలో రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్‌కుమార్‌ ఉన్నారు.

లాంబా ఫిర్యాదు ప్రకారం.. ఎంసీడీలో అధికారి తనకు తెలుసని, టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత పీఏనంటూ రాజీవ్‌ భట్టాచార్య తొలుత పరిచయం చేసుకున్నాడు. ఎంపీ కవితకు కో–ఆర్డినేటర్‌ అంటూ శుభాంగి గుప్తాను పరిచయం చేశాడు. ఆ తర్వాత దుర్గేశ్‌కుమార్‌ను ఎంపీ మరో పీఏ అంటూ పరిచయం చేశాడు. ముగ్గురూ కలిసి రూ.5 లక్షలు డిమాండు చేశారు. తదనంతరం జరిపిన చర్చల్లో చివరకు రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నారు. బీష్మంబర్‌దాస్‌ మార్గ్‌లోని ఎంపీ నివాసానికి డబ్బు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లాంబా సీబీఐకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. 

ఢిల్లీలో నాకు పీఏలెవరూ లేరు: ఎంపీ ఢిల్లీలో తనకు వ్యక్తిగత సహాయకులు ఎవరూ లేరని ఎంపీ మాలోత్‌ కవిత స్పష్టం చేశారు. ఓ గృహ నిర్మాణదారుడి నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాలో తన పీఏ ఉన్నాడంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన దుర్గేశ్‌ అనే వ్యక్తి కేవలం 2 నెలల కిందటే కారు డ్రైవర్‌గా చేరాడని, అతడికి స్టాఫ్‌ క్వార్టర్స్‌ ఇచి్చనట్లు వెల్లడించారు. యూపీకి చెందిన దుర్గేశ్‌కు తాను ఢిల్లీ వెళ్లినప్పుడే వాహనం ఇస్తానని, గురువారం జరిగిన ఘటన నేపథ్యంలో తక్షణమే విధుల నుంచి తొలగించానని వివరణ ఇచ్చారు.  

చదవండి: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top