ముగిసిన మ్యాచ్‌కు కొత్తగా రూల్స్‌ ఏంటో?.. మళ్లీ సుప్రీంకు ఢిల్లీ సర్కార్‌ వర్సెస్‌ కేంద్రం పంచాయితీ

Delhi Govt Centre Fight For Control Of Bureaucrats Goes SC Again - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల నియంత్రణపై అక్కడి ప్రభుత్వానికే సర్వాధికారం ఉందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సమీక్షకు వెళ్లింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఇవాళ ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. అదే సమయంలో ఢిల్లీ వ్యవహారాలు తన అదుపులో ఉండేలా కేంద్రం తాజాగా పాస్‌ చేసిన ఓ ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.   

కేంద్రం శుక్రవారం ఓ ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దాని ప్రకారం.. బ్యూరోక్రాట్ల నియామకం, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం తరపున చివరి మధ్యవర్తిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను నియమించింది. అంతేకాదు.. అథారిటీ చైర్‌పర్సన్‌ హోదాలో ముఖ్యమంత్రిని, చీఫ్‌ సెక్రటరీని, అలాగే హోం శాఖ ప్రధాన కార్యదర్శిని ఈ అథారిటీలో స్థానం కల్పించింది. అథారిటీలో మెజార్టీ ఓటింగ్‌ల ఆధారంగా అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటింగ్‌లో ఏదైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే.. అప్పుడు లెఫ్టినెంట్‌గవర్నర్‌ నిర్ణయాన్ని తుది నిర్ణయంగా తీసుకుంటారు. 

అయితే.. పోస్టింగులు, ట్రాన్స్‌ఫర్‌లపై ఎల్జీకే తుది అధికారం కట్టబెడుతూ కేంద్రం దొడ్డిదారిన తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయించింది.  ఇది రాజ్యాంగ విరుద్ధమని, కోర్టు ఇచ్చిన అధికారాన్ని సైతం లాక్కునేందుకు కేంద్రం సిద్ధపడిందని ఆరోపిస్తోంది. 

సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చేసింది. ఆట ముగిశాక.. రూల్స్‌ మార్చేసినట్లుంది ఇప్పుడు కేంద్రం తీరు.. అని ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ పేర్కొన్నారు. అలాగే ఆ ఆర్డినెన్స్‌ ఇంకా పార్లమెంట్‌లో పాస్‌ కాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. 

ఈ ఆర్డినెన్స్‌ పార్లమెంట్‌ ఉభయ సభల్లో పాస్‌ కావాల్సి ఉంది. కానీ, రాజ్యసభలో బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేదు. దీంతో ప్రతిపక్షాలు ఈ ఆర్డినెన్స్‌ను అడ్డుకునే యత్నం చేయొచ్చు.

కేంద్ర వర్గాలు మాత్రం.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో తలెత్తిన వైరుధ్యాన్ని తొలగించేందుకే ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మే 11వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల విషయంలో సర్వాధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుందని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీస్‌, పబ్లిక్‌ ఆర్డర్‌, ప్రభుత్వానికి భూకేటాయింపులను మాత్రం మినహాయించి.. మిగతా అన్నింట్లో అధికారం ఢిల్లీ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది కోర్టు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top