‘చెయ్యి’ కలిపేదే లేదు!

CPM Political Strategy Not To Support Congress Nation Wide - Sakshi

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉందాం

ఊగిసలాట నుంచి ఏకాభిప్రాయానికి సీపీఎం కేంద్ర కమిటీ

బీజేపీ గెలిచే సీట్లలో ఇతర లౌకిక పార్టీలతో అవగాహన

హుజూర్‌నగర్, హుజూరాబాద్‌ తరహా వ్యూహం అమలు

సొంత బలం పెంపుపై దృష్టి పెట్టాలని సీపీఎం నిర్ణయం.. 

ఈ సమావేశాల్లోనే ఖరారు కానున్న పార్టీ జాతీయ మహాసభల రాజకీయ తీర్మానం 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘బీజేపీని ఓడించాల్సిందే.. కానీ అందుకోసం కాంగ్రెస్‌తో ఎక్కడా పొత్తు పెట్టుకోకూడదు. అలాగే బలమైన బూర్జువా ప్రాంతీయ పార్టీలతోనూ ఇదే వైఖరి అనుసరించాలి. విధానపరమైన పోరాటాలు చేయాలి. అయితే బీజేపీ గెలిచే అవకాశమున్న సీట్లల్లో ప్రత్యామ్నాయ లౌకిక పార్టీలతో అంతర్గత అవగాహన కలిగి ఉండాలి. పార్టీ కేడర్‌కు సూచించి సదరు లౌకిక పార్టీకి ఓటు వేయించాలి. తెలంగాణలో హుజూరాబాద్, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ అనుసరించిన వ్యూహాన్నే కొనసాగించాలి..’’వామపక్షాల్లో కీలకమైన సీపీఎం తాజా రాజకీయ వ్యూహం ఇదేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

దేశంలో బీజేపీ మతతత్వ పాలనను అడ్డుకోవడం, అదే సమయంలో పార్టీని బలోపేతం చేయడమనేవి సీపీఎం ప్రధాన లక్ష్యాలని వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాబోయే పార్టీ జాతీయ మహాసభలకు సంబంధించిన రాజకీయ తీర్మానాన్ని ఈ సమావేశాల్లోనే ఖరారు చేయనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకూ అదే వర్తించనుంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లు సీతారాం ఏచూరి, పినరై విజయన్, మాణిక్‌ సర్కార్, బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు రాజకీయ తీర్మానంపై తలమునకలై ఉన్నారు. 

ఊగిసలాట పోయి.. 
సీపీఎం గత సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌తోపాటు మరికొన్ని చోట్ల కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసింది. అయితే ఈసారి అలాంటి పొత్తులు పెట్టుకోకూడదని నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం సరికాదని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్‌ లౌకిక పార్టీయే అయినా.. ఆర్థిక విధానాల విషయంలో బీజేపీకి, దానికి తేడా లేదన్న భావన వ్యక్తమైనట్టు తెలిసింది. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్న విషయంలో ఇప్పటిదాకా పార్టీలో భిన్నాభిప్రాయం ఉండేదని.. అది ఇప్పుడు మారిందని ఓ సీపీఎం నేత చెప్పారు. 

ప్రధాన కర్తవ్యాలు రెండు 
ప్రస్తుతం సీపీఎం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకటి దేశంలో బీజేపీ మతతత్వ వ్యవహారాన్ని అడ్డుకోవడం, తద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ప్రయత్నించడం కాగా.. మరొకటి పార్టీని మరింత బలోపేతం చేయడమని అంటున్నాయి. ఈ రెండింటిలో ఇప్పటివరకు పార్టీ అనుసరించిన వ్యూహం పెద్దగా విజయవంతం కాలేదన్న భావన ఉందని చెప్తున్నాయి. బీజేపీని నిలువరించేందుకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లినా కొన్ని పార్టీలు మధ్యలో పొత్తులను వదిలేసి బీజేపీతో వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ప్రాంతీయ పార్టీలతో ఈ సమస్య ఉందని సీపీఎం నేతలు అంటున్నారు.

ఉదాహరణకు ఏపీలో ఒకప్పుడు సీపీఎం టీడీపీతో కలిసి నడిచిందని.. కానీ టీడీపీ పలుమార్లు సీపీఎంను విమర్శించడమే కాకుండా బీజేపీతో జతకట్టిందని గుర్తు చేస్తున్నారు. కొంతకాలం కింద జనసేనతో కలిసి ముందుకు నడవాలనుకున్నా ఆ పార్టీ కూడా నేరుగా బీజేపీతో జతకట్టిందని, విధానాల్లేని అలాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల సీపీఎం ప్రతిష్ట కూడా మసకబారిందని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లోనూ పార్టీ పట్ల గందరగోళం నెలకొందని.. కాబట్టి బూర్జువా పార్టీలతో పొత్తుల జోలికి వెళ్లొద్దని పార్టీ భావిస్తోందని వెల్లడిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top