దేశాన్ని అమ్మకానికి పెట్టి కమ్యూనిస్టులపై విమర్శలా!

CPM Leaders Fires On BJP in Andhra Pradesh - Sakshi

ప్రత్యేక హోదాపై నాలుక మడతేసింది ఎవరు? 

బీజేపీపై మండిపడిన సీపీఎం 

ముగిసిన పార్టీ రాష్ట్ర మహాసభలు ..

సాక్షి, అమరావతి: దేశాన్ని తాకట్టు పెట్టి బహిరంగ వేలానికి సిద్ధపడిన బీజేపీ.. కమ్యూనిస్టులను విమర్శించడం విడ్డూరమని సీపీఎం రాష్ట్ర కమిటీ మండిపడింది. బీజేపీ నేతల్ని కమ్యూనిస్టులు వెంటాడుతూనే ఉంటారని, ఆ పార్టీ నిజస్వరూపాన్ని బట్టబయలుచేసి ప్రజాకోర్టులో నిలబెట్టేది తామేనని ప్రకటించింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీ చట్టంలోని అంశాలను అమలు చేస్తామని చెప్పి మాటతప్పింది బీజేపీ కాదా? అని నిలదీసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి.

మహాసభల తీర్మానాలను పార్టీ నాయకులు ఎంఏ గఫూర్, మంతెన సీతారాం, ప్రభాకర్‌రెడ్డి, సీహెచ్‌ బాబూరావు బుధవారం మీడియాకు విడుదల చేశారు. ‘ప్రజల సమస్యలను పరిష్కరించమంటే కమ్యూనిస్టులపై దుమ్మెత్తిపోస్తారా, సోము వీర్రాజు లాంటి మతోన్మాద వ్యక్తులకు కమ్యూనిస్టుల విలువ, త్యాగాలు, పోరాటాలు ఏం తెలుసు’ అంటూ ఎద్దేవా చేసింది. వీర్రాజుకు దమ్ముండి తమ దగ్గరకు వస్తే ప్రజాసంఘాల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలన్నింటినీ చూపుతామని సవాల్‌ చేసింది. బీజేపీ మాదిరి తమకు రహస్య ఖాతాలు ఉండవని పేర్కొంది. కాసుల కక్కుర్తి కాషాయానిదేగానీ కమ్యూనిస్టులది కాదని చెప్పింది.  

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే నిర్మాణాన్ని పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ పార్టీ మహాసభ తీర్మానించింది. 1,05,601 కుటుంబాలు ముంపునకు గురవుతుంటే 15 ఏళ్లలో కేవలం 4 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని పేర్కొంది. పునరావాసాన్ని దశలవారీగా కాకుండా ఏకకాలంలో పూర్తిచేయాలని డిమాండ్‌ చేసింది. 

రాజధానిగా అమరావతినే ఉంచండి 
రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందని విమర్శించింది. దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేయాలని కోరింది. ఆస్తిపన్ను పెంపు ఆపాలని, చెత్త పన్ను రద్దు చేయాలని, మైనారిటీల అభివృద్ధికి సబ్‌ప్లాన్‌ను అమలు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని, దళితులపై దాడులు, సామాజిక సమస్యలపై పోరాడాలని పార్టీ మహాసభ తీర్మానించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top