వెనుకబడిన చోటే వెతుక్కొనేలా.. | Sakshi
Sakshi News home page

వెనుకబడిన చోటే వెతుక్కొనేలా..

Published Wed, Dec 27 2023 2:18 AM

congress party focus on lok sabha elections: telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉన్న నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం గాంధీ భవన్‌లో హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రెండు చోట్లా పార్టీ గెలుపునకు సహకరించే అంశాలు, ప్రతికూల పరిస్థితులపై చర్చించిన కాంగ్రెస్‌ నేతలు అందుకు తగిన కార్యాచరణను రూపొందించుకున్నారు.  

నిరాశపరిచిన ఫలితాలు.. 
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని నిరాశపరిచాయి. ఈ ఫలితాలను సమీక్షించుకున్న కాంగ్రెస్‌ పార్టీ మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్‌ స్థానాల్లో తమకు లభించిన ఓట్లు, ఇతర ప్రధాన పక్షాలకు వచ్చిన ఓట్ల సంఖ్య ఆధారంగా వ్యూహం రూపొందించుకోవాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో బీఆర్‌ఎస్‌తో పోలిస్తే వెనుకబడినప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలోనే ప్రజల మద్దతు లభించింది. మల్కాజిగిరి పరిధిలో బీజేపీ కంటే ఎక్కువ ఓట్లే వచ్చినా బీఆర్‌ఎస్‌ కంటే దాదాపు 3.5 లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి.

మల్కాజిగిరి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం కావడంతో పార్లమెంటు ఫలితాలు కొంతమేర భిన్నంగా ఉంటాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఆ నియోజకవర్గం పరిధిలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా బలపడాలని భావిస్తోంది. చేవెళ్లలోనూ బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు దాదాపు లక్ష ఓట్లు తక్కువగా వచ్చాయి. ఇక్కడ కూడా కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తే గెలుపు కష్టమేమీ కాదని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌ స్థానాల్లోనే కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది.

ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీకి బలమైన నాయకత్వం కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లకు కొత్త ఇన్‌చార్జీలను నియమించాలని పార్టీ భావిస్తోంది. ఇన్‌చార్జీల ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల సమన్వయంతో క్షేత్రస్థాయిలో కేడర్‌ను కదిలించాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఆసరాగా బ్యాలెట్‌ బాక్సులు నిండేలా పనిచేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ స్థానం పరిధిలో ఎంఐఎంను ఢీకొట్టడం కష్టమే అయినా అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్‌ వరకు పకడ్బందీగా వ్యవహరించాలని, ఎంఐఎంకు దీటైన అభ్యరి్థని రంగంలోకి దించాలని 
నిర్ణయించింది. 

ప్రజలకు దగ్గరగా పనిచేయండి: ఇన్‌చార్జి మంత్రి పొన్నం 
హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల నేతలతో జరిగిన సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేయడంలో పార్టీ నేతలు ముందుండాలని సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉండేలా నాయకులు పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్‌ కేడరంతా పాల్గొనాలని కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 28న వాడవాడలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement