సీనియర్లకు షాకిచ్చిన కాంగ్రెస్‌..!

Congress Names 30 Star Campaigners for West Bengal - Sakshi

స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో జీ 23 నేతలకు దక్కని చోటు

న్యూఢిల్లీ: అసమ్మతి నేతలకు కాంగ్రెస్‌ అధిష్టానం షాక్‌ ఇచ్చింది. స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో వారికి చోటివ్వలేదు. తొలి విడత పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా విడుదల చేసింది. దీనిలో అసమ్మతి నేతలుగా పేరుపొందిన జీ 23 నేతలు ఒక్కరు కూడా లేరు. కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం విడుదల చేసిన స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, సచిన్‌ పైలెట్‌, నవజోత్‌ సింగ్‌ సిధు, అభిజిత్‌ ముఖర్జీ, మహ్మద్‌ అజారుద్దిన్‌ తదితరులు ఉన్నారు. జీ23 గ్రూప్‌గా పేరు పొందిన అస్మమతి నేతలకు ఎవరికి ఈ జాబితాలో స్థానం దక్కలేదు. 

కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ స్టార్‌ క్యాంపెయినర్లకు సంబంధించిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. గతంలో సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ ‘‘జీ 23 గ్రూప్‌ అంటూ ఏం లేదు. సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ ఐకమత్యంగా ఉంది’’ అని తెలిపారు. గత వారం సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయినప్పటికి స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top