రాజ్‌భవన్‌ ఎదుటే బైటాయింపు

Congress MLAs on indefinite strike at  Rajasthan Rajbhavan - Sakshi

అసెంబ్లీని సమావేశపర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ధర్నా

మెజారిటీ ఉందని, అసెంబ్లీలో నిరూపిస్తానని సీఎం గహ్లోత్‌ ధీమా

గవర్నర్‌కు పై నుంచి ఒత్తిడి వస్తోందని ఆరోపించిన సీఎం

జైపూర్‌: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. తాజాగా, గవర్నర్‌ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు వేదిక మారింది. సోమవారం నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు. రాజ్‌భవన్‌లోనికి వెళ్లిన గహ్లోత్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాతో మాట్లాడారు.

ఆ తరువాత గవర్నర్‌ రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడారు. అసెంబ్లీ భేటీపై ప్రకటన చేసే వరకు ధర్నా చేస్తా్తమని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్‌ హామీ ఇవ్వడంతో ఐదు గంటల అనంతరం ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 174 ప్రకారం నడుచుకుంటానని గవర్నర్‌ హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా వెల్లడించారు. అయితే, సీఎం నుంచి గవర్నర్‌ కొన్ని వివరణలు కోరారని, వాటిపై ఈ రాత్రి కేబినెట్‌ భేటీలో గహ్లోత్‌ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అయితే, అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు తెలిపారు.

జైపూర్‌ శివార్లలోని ఒక హోటల్‌లో ఉంటున్న ఎమ్మెల్యేలు నాలుగు బస్సుల్లో అక్కడి నుంచి గహ్లోత్‌ నేతృత్వంలో రాజ్‌భవన్‌ చేరుకున్నారు. అంతకుముందు, ఆ హోటల్‌ వద్ద గహ్లోత్‌ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ను తన రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తించనివ్వకుండా ‘పై’నుంచి ఒత్తిడి వస్తోందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కోరుతూ గురువారమే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే తమది బాధ్యత కాబోదన్నారు. 103 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ వద్ద ధర్నా చేస్తున్నారని, ఇకనైనా గవర్నర్‌ అసెంబ్లీని సమావేశపర్చేందుకు  ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సుభాష్‌ గార్గ్‌ డిమాండ్‌ చేశారు. రాజ్‌భవన్‌ వద్ద ఘర్షణ వద్దని, గాంధీ మార్గంలో నిరసన తెలపాలని ఎమ్మెల్యేలకు గహ్లోత్‌ విజ్ఞప్తి చేశారు. 

తన ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని, అసెంబ్లీ వేదికగానే ఆవిషయాన్ని రుజువు చేస్తామని గహ్లోత్‌ పేర్కొన్నారు.   బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో ఆ ఎమ్మెల్యేలను బౌన్సర్లను పెట్టి వారిని ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించారని ఆరోపించారు. ఇప్పుడే అసెంబ్లీని సమావేశపర్చవద్దని గవర్నర్‌పై ఒత్తిడి వస్తోందని గహ్లోత్‌ ఆరోపించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, కరోనా వైరస్‌ విస్తృతి, ఆర్థిక రంగ దుస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కేబినెట్‌ భేటీ అనంతరం గవర్నర్‌ను కోరాం.  కానీ, ఇప్పటివరకు గవర్నర్‌ నుంచి స్పందన లేదు.  

 పైలట్‌ వర్గం ప్రస్తుతానికి సేఫ్‌
సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలపై  స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చడానికి కోర్టు ఆమోదం తెలిపింది. హైకోర్టులో రిట్‌ పిటషన్‌పై విచారణ సాగుతుండగానే.. అసెంబ్లీ స్పీకర్‌ జోషి బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు.

మరోవైపు, కాంగ్రెస్‌లో కొన్ని నెలల క్రితం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరడాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంటూ, ఆ విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ శుక్రవారం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను అభ్యర్థించానని, దానిపై స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ ఎమ్మెల్యే పిటిషన్‌లో వివరించారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరగనుంది. ఆ బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంతోనే గహ్లోత్‌ సర్కారు పూర్తి మెజారిటీ సాధించగలిగింది.      
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top