షోకాజ్‌ అందుకున్న మర్నాడే బీజేపీలోకి ఏలేటి | Sakshi
Sakshi News home page

షోకాజ్‌ అందుకున్న మర్నాడే బీజేపీలోకి ఏలేటి

Published Fri, Apr 14 2023 4:04 AM

Congress leader Maheshwar Reddy joins BJP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/నిర్మల్‌: ‘నేనేమైనా ఉగ్రవాదినా? ఏమైనా తప్పు చేశానా? కారణం ఏమిటో చెప్పకుండా నాకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడం.. గంటలోగా వివరణ కోరడం ఏమిటి? 15 ఏళ్లుగా అవినీతి మచ్చ లేకుండా పనిచేస్తున్న నన్ను ఎలాంటి ఆధారాల్లేకుండా, అభాండాలు వేసి బయటకు వెళ్లేలా చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అవమానాల నుంచి విముక్తి కోసమే బీజేపీలో చేరా’అని తెలంగాణ సీనియర్‌ నేత, నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న మహేశ్వర్‌రెడ్డి గురువారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీలో చేరారు. గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత బీజేపీ చేరికల కమిటీ కన్వీ నర్‌ ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ కలసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ నివాసంలో ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ప్రత్యేకంగా సమావేశమ య్యారు.

ఆ తరువాత ఆయన్ను తరుణ్‌ ఛుగ్, బండి సంజయ్, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సంగప్ప బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ మహేశ్వర్‌రెడ్డికి జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం జేపీ నడ్డా నివాసం వద్ద తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. 

బీజేపీ, మోదీతోనే అరాచక పాలనకు తెర
రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించడం కేవలం బీజేపీ, ప్రధాని మోదీ వల్లే సాధ్యమవుతుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలసి అడుగులేసే దిశగా నడుస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అవినీతిపై పోరాడాల్సిన కాంగ్రెస్‌ పార్టీ ఏమీ పట్టనట్లుగా పార్లమెంటులో వారితో కలసి తిరుగుతోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌తో పొత్తు విషయంలో కాంగ్రెస్‌ నాయకులు రోజుకో విధంగా మాట్లాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని... దీంతో రాష్ట్రంలో పార్టీ దయనీయమైన పరిస్థితికి చేరుకుందని, ఎటుచూసినా అయోమయం నెలకొందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు కోవర్టులుగా ఉన్నారనే నిందలను పలువురు కాంగ్రెస్‌  నేతలపై మోపుతున్నారని... అసలు ఎవరు ఎవరి కోవర్టులో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు.

15 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా పనిచేస్తున్న తనపై కావాలనే కొందరు సోషల్‌ మీడియాలో నిందలు మోపుతున్నారని  ధ్వజమెత్తారు. కొంతకాలంగా కాంగ్రెస్‌లో ఒక నాయకుడు పథకం ప్రకారమే సీనియర్లను బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

అందరం కలసికట్టుగా...: సంజయ్‌ 
రాష్ట్రంలో అహంకారపూరిత నియంత పాలనను అంతమొందించడానికి ప్రతి ఒక్కరం కలసికట్టుగా పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. మహేశ్వర్‌రెడ్డి లాంటి సీనియర్‌ నాయకుడు బీజేపీలో చేరడం సంతోషకరమన్నారు. కేవలం నిర్మల్‌ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీ బలపడేందుకు మహేశ్వర్‌రెడ్డి లాంటి నాయకులు ఉపయోగపడతారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలన్న ఏౖకైక లక్ష్యంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరడం సంతోషకరమని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో నిర్మల్‌ నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణను అందరికీ అందించేలా బీజేపీనే చర్యలు చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

బీజేపీలో మహేశ్వర్‌రెడ్డి చేరికకు కారణాలివే
సాక్షి, హైదరాబాద్‌: సొంత పార్టీలో విభేదాలు... నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరి ణామాలు... వెరసి నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడానికి కారణమయ్యాయి. కొంతకాలంగా మహేశ్వర్‌రెడ్డి పార్టీ మార్పు ప్రచారం జరుగుతున్నప్పటికీ నిర్మల్‌లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే ఆయన కొనసాగు తారని భావించారు.

అయితే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో ముదిరిన విభేదాలు, తాజాగా ఇచ్చిన షోకాజ్‌ నోటీసుతో ఏలేటి అహం దెబ్బతింది. అదే సమయంలో నియోజకవర్గంలో అధికార పార్టీ అసంతృప్త నేతలు బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఏలేటి తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కమలదళంలో చేరారు. మైనారిటీల ప్రభావం అధికంగా ఉండే నిర్మల్‌లో ఆయన నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందోననే అంశాలపై రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement