దేశ మనోభావాలను కించపర్చారు

Congress has insulted labour by boycotting new Parliament building inauguration - Sakshi

60 వేల మంది కార్మికుల శ్రమను అగౌరవపర్చారు

కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం  

అజ్మీర్‌:  పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ మనోభావాలను కాంగ్రెస్‌ కించపర్చిందని, 60,000 మంది కార్మికుల కఠోర శ్రమను అగౌరవపర్చిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో బుధవారం ఓ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు.

మూడు రోజుల క్రితం పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభించుకున్నామని, ప్రజలంతా గర్విస్తున్నారని, దేశ ప్రతిష్ట మరింత పెరగడంతో వారంతా సంతోషిస్తున్నారని మోదీ తెలిపారు. అన్నింటిలోనూ బురదజల్లే రాజకీయాలు చేసే కాంగ్రెస్, ఇతర పార్టీలు పార్లమెంట్‌ కొత్త భవనం విషయంలోనూ అదే పని చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్‌ కొత్త భవవాన్ని ప్రారంభించుకొనే అవకాశం కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని, కాంగ్రెస్‌ దాన్ని ‘స్వార్థపూరిత నిరసన’ కోసం వాడుకుందని ఆరోపించారు.

మన దేశం సాధిస్తున్న ప్రగతిని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. వారి అవినీతిని, కుటుంబ వారసత్వ రాజకీయాలను తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే తమపై కోపంగా ఉన్నారని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వారి ఆరాచకాలను ఒక ‘నిరుపేద బిడ్డ’ సాగనివ్వడం లేదని, అది వారు తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు.    

కాంగ్రెస్‌ పాలనలో అవినీతి వ్యవస్థ  
‘‘పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని 55 సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ, పేదలను దగా చేసింది. పేదలను తప్పుదోవ పట్టించడం, వారిని ఎప్పటికీ పేదలుగానే ఉంచడం కాంగ్రెస్‌ విధానం. కాంగ్రెస్‌ పాలనలో రాజస్తాన్‌ ప్రజలు ఎంతగానో నష్టపోయారు. తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాసేవకు, సుపరిపాలనకు, నిరుపేదల సంక్షేమానికి అంకితం చేస్తున్నాం. 2014కు ముందు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చేవారు. నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగేవి. అప్పట్లో రిమోట్‌ కంట్రోల్‌తో పాలన సాగేది.

కాంగ్రెస్‌ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చే అవినీతి వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌ గురించి మాట్లాడుకుంటోంది. దేశంలో పేదరికం అంతమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మన దేశం సాధించిన ప్రతి విజయం వెనుక ప్రజల చెమట చుక్కలు ఉన్నాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతీయులు ప్రదర్శిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. కొందరు వ్యక్తులకు మాత్రం ఇది అర్థం కావడం లేదు’’ అని ప్రధాని మోదీ తప్పుపట్టారు.   
అజ్మీర్‌లో సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top