TS: కాంగ్రెస్‌ ఎప్పటికీ మారదా.. ఇంతకీ ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

TS: కాంగ్రెస్‌ ఎప్పటికీ మారదా.. ఇంతకీ ఏం జరిగింది?

Published Sat, Jan 27 2024 10:16 PM

Congress Dramatic Consequences Nomination Mahesh Goud Balmoor Venkat MLCs - Sakshi

కాంగ్రెస్ అనేది ఓ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..? పార్టీలోకి ఎవరు వస్తారో? ఎవరు బయటకు వెళ్లిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా గందరగోళంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అంతే.. అధికారం వచ్చినా అంతే.. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. నేతల మనోభావాలను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్‌ ఎప్పటికీ మారదా అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇంతకీ టీ.కాంగ్రెస్‌లో ఏం జరిగింది?

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అభ్యర్ధుల ఎంపిక‌లో ఎన్నో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేష‌న్ల గ‌డువు ముగిసే రోజు వ‌ర‌కు ఎన్నో ట్విస్టులు, మ‌రెన్నో మ‌లుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది. రెండు ఎమ్మెల్సీల‌కు అద్దంకి ద‌యాక‌ర్, మ‌హేష్ కుమార్ గౌడ్ల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని మొద‌ట అనుకున్నారు.

కాని రాత్రికి రాత్రే కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI అధ్యక్షుడు బ‌ల్మూరి వెంక‌ట్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువ‌త‌కు అవకాశం క‌ల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బ‌ల్మూరికి టికెట్ క‌న్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి దయాకర్‌.. మ‌హేష్ గౌడ్‌లలో ఒక‌రిని త‌ప్పించాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఎంతో త‌ర్జన భర్జనల అనంత‌రం మొద‌ట మ‌హేష్ గౌడ్‌ను త‌ప్పించాల‌నుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మ‌ళ్ళుతున్న నేప‌ధ్యంలో బీసీ నేత అయిన మ‌హేష్‌గౌడ్‌ను త‌ప్పిస్తే.. పార్లమెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెష్‌కి న‌ష్టం త‌ప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్‌ను తప్పించడానికి నిర్ణయించింది.

సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొంద‌రికి ఆఖరి నిమిషంలో ఛాన్స్‌ చేజారిపోవ‌డాన్ని అర్దం చేసుకొవ‌చ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ‌నే స‌రిగా జ‌ర‌గ‌లేద‌నే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమ‌వుతోంది. అభ్యర్ధుల ఎంపికను చివ‌రి నిమిషం వ‌ర‌కు తేల్చకుండా ఎందుకు నాన్చాల్సి వ‌చ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది.

అలాంట‌ప్పుడు టికెట్లు ఆశించిన నేత‌ల‌తో పార్టీ పెద్దలు చ‌ర్చించి.. అవ‌కాశం దక్కని నేత‌ల‌ను బుజ్జగిస్తే స‌రిపోయేది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అదే చేసారు. టికెట్లు ద‌క్కని నేత‌ల రాజ‌కీయ భ‌విష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు స‌జావుగా జ‌రిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది. కాని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యంలో.. అభ్యర్ధుల‌ను చివ‌రి నిమిషంలో  మార్చడం వ‌ల్ల ఎంతో గంద‌గోళం తలెత్తింది.

వివిధ కార‌ణాల వ‌ల్ల అద్దంకి ద‌యాక‌ర్ కి అవ‌కాశం క‌ల్పించ‌లేని పరిస్తితి వస్తే.. కనీసం ఆయ‌న‌కు పరిస్తితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి.. నామినేష‌న్ ప‌ర్వంలో ఆయ‌న్ను భాగ‌స్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని అద్దంకి ప్రక‌టించిన త‌ర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా కాంగ్రెస్ పెద్దల తీరు మార‌క‌పోతే ఎలా అని పార్టీ నేత‌లే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అంద‌రిని క‌లుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement