పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదు

CM YS Jagan Comments On Chandrababu In AP Assembly Sessions - Sakshi

చంద్రబాబే ఎత్తు తగ్గీ తగ్గీ 2024 ఎన్నికల్లో కుప్పంలో ఓడి మరుగుజ్జు అవుతారు

శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

బాబు చేసిన తప్పులను సరిదిద్ది.. పనులు చకచకా పూర్తి చేస్తున్నాం

అతి తక్కువ సమయంలో ఎగువ కాఫర్‌ డ్యామ్, స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పూర్తి 

గతేడాది జూన్‌ 11న స్పిల్‌ వే మీదుగా గోదావరిని మళ్లించాం

వరద వచ్చేలోగా దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసి.. ప్రధాన డ్యామ్‌ పనులకు శ్రీకారం 

ప్రాధాన్యత క్రమంలో నిర్వాసితులకు పునరావాసం

ఆగస్టులోగా 20,496 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తాం

ఏమీ చేయకుండా రూ.100 కోట్లతో భజన చేయించుకున్న బాబు

అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదు. చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారు. త్వరలోనే మరుగుజ్జు అవుతారు. దారుణాలు, మోసాలు చేసిన చంద్రబాబును 2019 ఎన్నికల్లో ప్రజలు 23 సీట్లకే పరిమితం చేసి, ఎత్తు తగ్గించారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక ఎన్నికల్లో ఘోరంగా ఓడించి.. మరింత ఎత్తు తగ్గించారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనూ ఓడిపోయి చంద్రబాబు మరుగుజ్జు అవుతారు.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నట్లు తరచుగా కథనాలను వండివార్చుతున్నారని, వీళ్లకు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నట్లు ఎవరు చెప్పారని నిలదీశారు.  రామోజీరావ్, రాధాకృష్ణలు తన దగ్గరకు ఎలాగూ రారని.. అలాంటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అడిగారా? అని ప్రశ్నించారు. అబద్ధాలకైనా, వక్రీకరణ కైనా హద్దు పద్దూ ఉండాలన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జరిగిన చర్చలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆయన వివరించారు. సీఎం ఏమన్నారంటే... 

ప్రణాళికాయుతంగా పనులు 
► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం. గత ఏడాది జూన్‌ 11న గోదావరిని దిగ్విజయంగా స్పిల్‌వే మీదుగా మళ్లించాం. మెయిన్‌ డ్యామ్‌ పనులు చాలా వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. డిజైన్స్‌కు అనుమతి రావడమే పెద్ద సమస్య. సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతో డిజైన్స్‌కు అనుమతి కోసం చర్చలు జరుపుతున్నాం.
► దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులకు సంబంధించిన డిజైన్లకు ఇటీవలే అనుమతి వచ్చింది. ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వరద కారణంగా మెయిన్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో పడ్డ భారీ గుంతలను ఎలా పూడ్చాలన్న దానిపై నెలాఖరులోగా డిజైన్లు ఖరారు అవుతాయని కేంద్ర మంత్రి షెకావత్‌ అందరికీ ఊరటనిచ్చే మాటలు చెప్పారు. 

పునరావాసం పనులు చకచకా
► ఐదేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. పునరావాసం కల్పించకుండానే కాఫర్‌ డ్యామ్‌ పనులు మొదలు పెట్టేశారు. ఆ పనులు పూర్తయ్యుంటే.. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన త్యాగమూర్తుల పరిస్థితి ఏంటి? సహాయం చేయలేదు. పునరావాసం కల్పించలేదు. ఇళ్లు కట్టించలేదు. 
► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యతా క్రమంలో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నాం. ప్రాజెక్టులో మొత్తం 373 జనావాస ప్రాంతాలు ముంపునకు గురవుతుంటే.. ఇప్పటికే 27 జనావాస ప్రాంతాలను పునరావాస కాలనీలకు తరలించాం. 
► ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయిన నేపథ్యంలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. అందుకే తొలుత  20,496 కుటుంబాలను తరలించాలని లెక్క వేశాం. ఇప్పటికే 7,962 కుటుంబాలను తరలించాం. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద 3,228 కుటుంబాలకు పునరావాసం కల్పించాం. వాళ్లను తీసేస్తే..17,268 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఇళ్లను వేగంగా కట్టిస్తున్నాం. ఇందులో 11,984 ఇళ్లు పూర్తయ్యాయి. మిగతా 5,284 ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులోగా 20,496 కుటుంబాలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తాం.

పనుల్లో ప్రగతి ఇదీ  
► స్పిల్‌వే.. 55 మీటర్లు పియర్స్‌ (కాంక్రీట్‌ దిమ్మెలు) ఎత్తున నిర్మించాలి. చంద్రబాబు హయాంలో 2 పియర్లను మాత్రమే 32–33 మీటర్లకు లేపి.. ఒక ఇనుపరేకును పెట్టి.. జాతికి అంకితం చేసి.. ప్రాజెక్టు అయిపోయినట్లు ప్రజల్లో భ్రమ కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. 
► చంద్రబాబు కాంక్రీట్‌ పనుల ప్రారంభానికి 2016 డిసెంబర్‌ 30న శంకుస్థాపన చేశారు. ఐకానిక్‌ బ్రిడ్జి, కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభానికి 2017 జూన్‌ 8న మరో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయిందని చెబుతూ 2018 జూన్‌ 11న మరో శంకుస్థాపన, రేడియల్‌ గేట్ల తయారీని ప్రారంభిస్తూ 2018 డిసెంబర్‌ 14న మరో శంకుస్థాపన చేశారు. 
► వీటి కన్నా మూడు నెలలు ముందే 2018 సెప్టెంబర్‌లో స్పిల్‌వేలో గేలరీ వాక్‌ అని పెట్టాడు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పోలవరం ప్రాజెక్టు అయిపోయిందని భ్రమ కల్పిస్తూ ఫ్యామిలీ టూర్‌కు వెళ్లారు.

వారిది భజన.. మాది చిత్తశుద్ధి
► ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మోసం చేయడానికి రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టారు. అక్కడికి తీసుకెళ్లిన వారితో ఒక పాట (జయము జయము చంద్రన్నా.. పాట ప్రదర్శన) పెట్టించారు. ప్రజలను ఇంత దారుణంగా మోసం చేశారు కాబట్టే బుద్ధి చెప్పారు. 
► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్‌వేను, స్పిల్‌ చానల్‌ను ఏ రకంగా పూర్తి చేశామో స్పష్టంగా కన్పిస్తోంది. అప్రోచ్‌ చానల్‌ను సేఫ్‌ లెవల్‌కు పూర్తి చేశాం. స్పిల్‌ చానల్‌లో ఫిల్లర్లు కూడా పూర్తి చేయకుండా రెండు ఐరన్‌ రేకులు పెట్టి, గేట్లు పెట్టామని వాళ్లు ప్రచారం చేసుకుంటే, ఇప్పుడు 48 గేట్లు అమర్చాం. 
► ప్రధాన డ్యామ్‌లో గ్యాప్‌–3ని పూర్తి చేశాం. అన్నిటికీ మించి కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశాం.  నదిని స్పిల్‌వే మీదుగా మళ్లించడం పూర్తయింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ముమ్మరంగా చేస్తున్నాం. ఇది పూర్తి కాగానే మెయిన్‌ డ్యామ్‌ పనులకు శ్రీకారం చుడతాం. 
► హైడల్‌ పవర్‌ (జల విద్యుత్‌) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. కీలక టన్నెల్‌ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఎడమ, కుడి కాలువకు కనెక్టివిటీ పనులు కొనసాగుతున్నాయి. (పనులు జరుగుతున్న తీరుపై వీడియో ప్రదర్శించారు). ఇంత జరుగుతున్నా మేము చంద్రబాబులా బస్సులు పెట్టలేదు.. జనంతో భజన చేయించుకోలేదు. చిత్తశుద్ధితో చేస్తున్నాం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top