ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో ముగిసిన భేటీ.. కేసీఆర్‌ నిర్ణయాలు ఇవే..

CM KCR Has Fight The Center Over Rice Procurement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ శనివారం అత్యవసరంగా మంత్రులు, అధికారులతో ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమావేశంలో కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top