కేటీఆర్‌ సీఎం ప్రచారంపై కేసీఆర్‌ క్లారిటీ

CM KCR Clarity On KTR Becoming Telangana Chief Minister - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్న ప్రచారానికి సీఎం కేసీఆర్‌ తెరదించారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, సీఎంగా తానే కొనసాగుతానని వెల్లడించారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఈ నెల 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్‌లో  లక్షలాది మందితో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీ లేరని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలు విజయం టీఆర్‌ఎస్‌దే అని తెలిపారు. ఈ నెల 11న గెలిచిన కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు రావాలని సూచించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు సంబంధించి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీల్డ్‌ కవర్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లను పంపిస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top