సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేప కథాచిత్రం నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ సిట్ విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకు వీరుల ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు అంటూ వ్యాఖ్యానించారు.
సింగరేణిలో దొంగలు దొరికారని హరీష్ ఆరోపిస్తే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని సిట్ అధికారులను అడిగితే సమాధానం లేదు, మా వ్యక్తిత్వ హననానికి గురిచేసిన వాళ్ల చర్యలు ఏవి అని అడిగాను. వేధింపుల తప్ప.. సిట్ అడిగినదాంట్లో ఏమీ లేదని కేటీఆర్ అన్నారు.
‘‘నాకు మద్దతు పలికిన పార్టీ నాయకత్వానికి- సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. పోలీసుల సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. నేను సిట్‌ను ప్రశ్నించాను. మాపై తప్పుడు ప్రచారం, లీకులు ఇస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగాను. ట్యాప్ చేసి హీరోయిన్‌లను బెదిరించినట్లు కథనాలు నిజామా? అని అడిగాను. హీరోయిన్‌పై కథనాలు వాస్తవం కాదని పోలీసులు ఖండించారు.
..మా నాయకుల ఫోన్ ట్యాప్ కావడం లేదా అని నేను అడిగా. మంత్రి ఫోన్ ట్యాప్ అయిందని అంటున్నారు.. నిజమేనా అని అడిగాను. సిట్ అధికారులు ఫోన్ కాల్స్ మాట్లాడటమే సరిపోయింది. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకైనా.. ఎన్ని సార్లు అయినా వస్తాం. సింగరేణి టెండర్‌లలో సీఎం - మంత్రుల మధ్య వాటాల పంచాయతీపై హరీష్‌రావు బయటపెట్టారు.
..సీఎం అనుచరుడు 3 వందల కోట్ల టెండర్ గురించి గన్ పెడితే, మంత్రి కొడుకు భూ కబ్జాకు పాల్పడితే సిట్ ఎందుకు లేదు?. ఖాకి బుక్ అందరికీ ఒకేలా ఎందుకు లేదు? సిట్ అడిగిందే అడగడం - తిప్పి తిప్పి అడగడం తప్ప ఏమి లేదు. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు.. మాకు కుటుంబాలు ఉన్నాయి మీడియా వాస్తవాలను రాయాలి. నన్ను ఒక్కరినే విచారణ చేశారు. తారక రామారావు, సిట్ అధికారులు తప్ప ఎవరూ లేరు. మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్ చెప్పింది... నేను సహకరిస్తానని చెప్పాను’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


