విచారణ అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వస్తున్న కేటీఆర్
ఎన్నిసార్లు పిలిచినా సిట్ విచారణకు వెళ్లేందుకు సిద్ధం: కేటీఆర్
పదేపదే అవే ప్రశ్నలు అడిగారు.. టీవీ సీరియల్‌లా సాగదీశారు
గంటలకొద్దీ టైంపాస్ మినహా వేరే విషయమంటూ లేదు
300 పేర్లు చదివి వారు తెలుసా అని అడిగారు
ఇతరులతో కలిపి సిట్ నన్ను విచారించిందన్నది అవాస్తవం
లీకుల కథనాలకు బాధ్యులెవరని అధికారులను అడిగా
తప్పించుకునే ధోరణిలో ‘సిట్’ సమాధానాలు ఉన్నాయి
ప్రభుత్వ లీకుల ఆధారంగా వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అనంతరం కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘సిట్ అధికారులు నన్ను ఏ కారణంతో పిలిచారో తెలియదు. అడిగిన ప్రశ్నలనే మళ్లీమళ్లీ అడిగారు. సిట్ విచారణకు భయపడేదే లేదు. ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో సుమారు ఏడు గంటలపాటు సాగిన సిట్ విచారణ అనంతరం కేటీఆర్ శుక్రవారం రాత్రి తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘సిట్ అధికారులు ఒక టీవీ సీరియల్ తరహాలో సాగదీత ధోరణిలో ప్రశ్నలు వేసి 300 పేర్లు చదివి వారు తెలుసా అని అడిగారు. విచారణ పేరిట గంటలకొద్దీ టైంపాస్ చేయడం మినహా వేరే విషయమంటూ లేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే..‘గత రెండేళ్లుగా ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యాలు, అవినీతిని బీఆర్‌ఎస్ నాయకత్వం నిత్యం ఎండగడుతుండటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం రేవంత్ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నాడు. ఏదో ఒక కథను సృష్టించి ప్రజలను భ్రమింప చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎవరినో పక్కనపెట్టి నన్ను విచారణ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. సిట్ విచారణలో కేటీ రామారావు తప్ప ఇంక ఏ రావూ లేడు. మంత్రులతోపాటు మా ఫోన్లు కూడా ప్రస్తుతం ట్యాప్ అవుతున్నాయని ఈరోజు జరిగిన విచారణలో బయటపడింది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
లీకుల పేరిట కథనాలకు బాధ్యులెవరు?
‘రెండేళ్లుగా లీకులిస్తూ మీడియాలో వచ్చే కథనాలతో మా పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడింది ఎవరని సిట్ అధికారులను ప్రశ్నిస్తే.. మీడియా రాస్తే మాకేం సంబంధం అంటూ సిట్ చేతులు దులుపుకుంది. విచారణ పేరిట లీకులివ్వడం మంచి పద్ధతి కాదని చెప్పా. యూట్యూబ్ చానళ్లు, మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవమైతే సమాచారం ఎవరిచ్చారో చెప్పాలని అడిగా. లీకుల పేరిట నడిపిన కథనాలు, మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభ, మా వ్యక్తిత్వ హననం దృష్ట్యా లీకులను నిరోధించాలని కోరా. ప్రభుత్వం ఇచ్చే లీకుల ఆధారంగా వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా.
మా ఎమ్మెల్యేలు, మా నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో లేదో చెప్పాలని సిట్ అధికారులను అడిగితే సంబంధం లేదని నీళ్లు నములుతున్నారు. ఓ మంత్రి కూడా ఆయన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ చేసిన వ్యాఖ్యలపైనా సిట్ అధికారులు తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంతోపాటు కాంగ్రెస్ మంత్రులు, నేతలపై వస్తున్న ఆరోపణలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు.


