సంజయ్‌ రౌత్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సింది: నవనీత్‌ రాణా

CM Eknath Shinde Mp Navneet Respond On Sanjay Raut Arrest In Ed Case - Sakshi

సాక్షి ముంబై: ఈడీ దాడులకి భయపడి మాతో చేరాలనుకునేవారు మా వద్దకి రావద్దని, మాతో చేరవద్దని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే పేర్కొన్నారు. బీజేపీలో కూడా చేరవద్దన్నారు. సంజయ్‌ రౌత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం.. తనను శివసేన నుంచి దూరం చేసేందుకే కేంద్రం ఈడీతో దాడులు చేయిస్తోందని.. ఎవరెంత బెదిరించినా తాను  శివసేనను వీడనని సంజయ్‌ రౌత్‌ తన ట్విట్టర్‌లో పేర్కొనడంపై శిండే స్పందించారు.

శనివారం అజిత్‌ ఖోత్కర్‌ శిండే వర్గంలో చేరే సమయంలో తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని శిండే వర్గానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏక్‌నాథ్‌ శిండే మాట్లాడారు. ముఖ్యంగా ఈడీకి భయపడి ఎవరు మా వద్దకి రావద్దన్నారు. మీరు తప్పుచేయకుంటే ఈడీకి ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. తప్పులేనప్పుడు ఈడీకి సహకరించాలని, ఈడీ తనపని తాను చేసుకుంటుందన్నారు.
సంబంధిత వార్త: శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్‌ అరెస్టు

లెక్కలు చూపించాల్సిందే: కిరీట్‌ సోమయ్య 
సంజయ్‌ రౌత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ‘ఇక లెక్కలు చూపించాల్సిందే’ అంటూ బీజేపీ నేత కిరీట్‌ సోమయ్య తనదైన శైలిలో రావుత్‌కు చురకలంటించారు. మాఫియా సంజయ్‌ రౌత్‌ అంటూ సంభోదిస్తూ, ఆయనకు ఇక లెక్కలు చూపించాల్సి రానుందన్నారు. రూ. 1,200 కోట్ల పత్రాచాల్‌ కుంభకోణం, వసాయి నాయిగావ్‌లోని బిల్డర్ల కుంభకోణం లేదా మహారాష్ట్రను దోచుకునే పనిచేసిన మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఇలా మాఫియాగిరి, దాదాగిరి చేస్తూ అందరినీ జైల్లో వేస్తానని బెదిరింపులు చేశారు. కానీ ఇప్పుడు వారికి ఈ విషయాలన్నింటిపై లెక్కలు చూపించాల్సిన సమయం వచ్చిందని కిరీట్‌ సోమయ్య పేర్కొన్నారు.  

ఎన్నడో అరెస్టు చేయాల్సింది: నవనీత్‌ రాణా 
శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎంపీ నవనీత్‌ రాణా తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సింది అని అన్నారు. విలేకరిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సంజయ్‌ రౌత్‌ వద్ద ఇంతపెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సవాల్‌ విసిరారు. అదేవిధంగా సంజయ్‌ రౌత్, ఉద్దవ్‌ ఠాక్రేలు తమ పదవుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సంజయ్‌ రౌత్‌ గతంలోనే అరెస్టు చేసి ఉండాల్సిందన్నారు.  
చదవండి: గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్‌

రౌత్‌కు ఇప్పుడు తెలిసొస్తుంది: నితేష్‌ రాణే 
అందరి ఉదయం పాడుచేసే సంజయ్‌ రౌత్‌కు ఇప్పుడు ఆయన ఉదయం పాడవడం తనకు సంతృప్తిగా ఉందని నారాయణ రాణే కుమారుడైన బీజేపీ నాయకుడు నితేష్‌ రాణే పేర్కొన్నారు. ముఖ్యంగా సంజయ్‌ రౌత్‌కు నాకు ఎప్పుడు ఏమి జరగదని భావించేవారు. కాని ఈడీ దర్యాప్తు, ఇతరులను ఇబ్బందులు పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు సంజయ్‌ రౌత్‌కు తెలిసివస్తుందంటూ నితేష్‌ రాణే మండిపడ్డారు.  

దేశంలోని ఎవరిపైనైనా దర్యాప్తు చేయవచ్చు: అజిత్‌ పవార్‌ 
సంజయ్‌ రౌత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌ సౌమ్యంగా స్పందించారు. బీడ్‌ పర్యటనపై ఉన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ, ఈడీకి దేశంలోని ఎవరినైన దర్యాప్తు చేసే అధికారం ఉందన్నారు. గతంలో కూడా అనేక మందికి ఈడీ నోటీసులు పంపించిందని గుర్తు చేశారు. 

మనీలాండరింగ్‌ కేసులో ప్రమేయంపై ఆరా..
కాగా, అంతకుముందు శివసేన నేత సంజయ్‌ రావుత్‌ నివాసంలో ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ముంబై భాండూప్‌లోని ఆయన నివాసానికి ఆదివారం ఉదయం ఏడు గంటలకే చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పత్రాచాల్‌ భూ కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరిపారు. ఈ మనీలాండరింగ్‌ కేసులో సంజయ్‌ రావుత్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఇప్పటికే ఈడీ రెండుసార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలిపి వాయిదా వేశారు. అయితే ఆదివారం ఉదయం ఈడీ అధికారులు ఏకంగా ఆయన నివాసానికే వచ్చి సోదాలు చేపట్టారు. ఈ విషయంపై శివసేన కార్యకర్తలు భగ్గుమన్నారు.

విషయం తెలుసుకున్న శివసేన కార్యకర్తలు వందలాది మంది భాండూప్‌లోని ఆయన నివాసస్థానం వద్దకి చేరుకున్నారు. సంజయ్‌ రావుత్‌కు మద్దతుగా అక్కడే ఆయన నివాసముంటున్న భవనం ముందు భైఠాయించి నిరసనలు తెలిపారు. ముఖ్యంగా శివసేన నేతలను భయపెట్టేందుకు  ఈడీ ద్వారా దాడులు చేయిస్తున్నారని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. సంజయ్‌ రావుత్‌ ఎలాంటి తప్పుచేయలేదని, అన్ని విధాలుగా ఈడీకి తాను సహకరించనున్నట్టు ప్రకటించినప్పటికీ ఈ విధంగా దాడులు చేపట్టి భయబ్రాంతులకు గురిచేసేలా చేయడం సరికాదని శివసేన కార్యకర్తలు అంటున్నారు. ఇలా శివసేన నాయకులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు శిందేవర్గం, బీజేపీ నాయకులు ఈడీ సోదాలకు మద్దతు పలుకుతున్నారు. 

శివసేనను వీడను: సంజయ్‌ రౌత్‌ 
తప్పుడు ఆ«ధారాలు, తప్పుడు సాక్ష్యాలతో నాపై దాడులు చేస్తున్నారని శివసేన నేత సంజయ్‌ రావుత్‌ ఆరోపించారు. సంజయ్‌ రావుత్‌ నివాసంలో ఈడీ దాడుల అనంతరం ట్విట్టర్‌ ద్వారా బీజేపీ పేరు ప్రస్తావించకుండానే ఎవరెన్ని చేసినా, ఎన్ని విధాలుగా బెదిరించినా నేను శివసేనను వీడనన్నారు. నేను మరణించినా లొంగిపోనంటూ ట్విట్టర్‌లో ఆయన స్పష్టం చేశారు.

ఈడీ పేరుతో బీజేపీ బెదిరిస్తోంది: అమోల్‌ మిట్కర్‌
సంజయ్‌ రావుత్‌ నివాసంపై ఈడీ దాడుల అనంతరం ఎన్సీపీ నాయకుడైన అమోల్‌ మిట్క ర్‌ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఈడీ దర్యాప్తు పేరుతో బెదిరించి బీజేపీ తమ ప్రత్యర్థులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. దివంగత శివసేన అధినేత బాల్‌ ఠాక్రే నిష్టావంతుడైన శివసైని కుడు సంజయ్‌ రావుత్‌ ఈడీ ముందు తలవంచలేదన్నారు. ఇప్పటివరకు ఈడీ దర్యాప్తుల బెదిరింపులకు అనేక మంది బీజేపీలో చేరారని మిట్కర్‌ ఆరోపించారు. పలువురు శివసేన ఎమ్మెల్యేలు కూడా విడిపోయారు. అనేక ఎమ్మెల్యేలు శివసేనను వీడిపోయినప్పటికీ సంజయ్‌ రావుత్‌ మాత్రం తలవంచకుండా పోరాడుతున్నారన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారని, అమోల్‌ తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top