గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు..స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

Devendra Fadnavis: Dont Agree With Governor Bhagat Singh Koshyari Remarks - Sakshi

సాక్షి ముంబై: మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ముంబై నగరంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని లేపాయి. గుజరాతీ, రాజస్థానీయులు ముంబైని వీడితే ముంబైలో డబ్బులుండవని, దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పిలువబడుతున్న ముంబై ఆ గుర్తింపును కోల్పోతుందంటూ భగత్‌సింగ్‌ కోశ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో తీవ్ర అక్రోశం వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలతోపాటు మహారాష్ట్రను అవమానించినట్టేనని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులతోపాటు అనేక మంది ముంబైకర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు క్షమాపణకు డిమాండ్‌ చేస్తున్నారు.

మరాఠీ ప్రజల పాత్ర కీలకం: ఫడ్నవీస్‌ 
మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వ్యాఖ్యలను నేను సమర్థించలేనని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు మహారాష్ట్ర అభివృద్ధిలో మరాఠీ ప్రజల పాత్ర కీలకమైనదని, దీన్ని ఎవరు కాదనలేరన్నారు. వ్యాపార రంగంలో కూడా ప్రపంచవ్యాప్తంగా మరాఠీ ప్రజల కీర్తిప్రతిష్టలున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో వేర్వేరు రాష్ట్రాల ప్రజలుకూడా సహకరించారని, కానీ మరాఠీ ప్రజల సహకారమే అత్యధికమైందన్నారు. ఈ విషయం నాకు తెలిసి గవర్నర్‌కు కూడా తెలుసని, ఆయన ఏ సందర్బంలో మాట్లాడారో స్వయంగా గవర్నరే స్పష్టం చేయాలని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. 
చదవండి: గవర్నర్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతం, మేము సమర్థించం: సీఎం ఏక్‌నాథ్‌ షిండే

గవర్నర్‌ క్షమాపణ చెప్పాలి: నానా పటోలే 
మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ మరాఠీ ప్ర జలకు క్షమాపణలు చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు నానా పటోలే డిమాండ్‌ చేశారు. భగత్‌సింగ్‌ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. దీంతో ఆయన వెంటనే మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నా రు. అదేవిధంగా గుజరాతీ, రాజస్థాన్‌ ప్రజల కారణంగా ముంబై, మహారాష్ట్రకు పేరు రాలేదని ముంబై, మహారాష్ట్ర వారిని పెంచిపోషించిందన్నారు. అదేవిధంగా అదానీ, అంబానీలకు  కూడా పేరు ప్రతిష్టలు ముంబై, మహారాష్ట్ర ఇచ్చిందన్నారు. కానీ ఆయన ఈ విధంగా ఛత్రపతి శివాజీ మహరాజ్, మహారాష్ట్రను తన వ్యాఖ్యల ద్వారా అవమానించా రని దీనిపై ఆయన వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరాలన్నారు. అదేవిధంగా బీజేపీ ఆయనను వెంటనే మహారాష్ట్ర నుంచి రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top