
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రం నినాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కావాలని కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు.
ప్రధాని మోదీ అరాచకాలను సహించని హిమాచల్ ప్రజలు బీజేపీని ఓడించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో మాట్లాడారు. గుజ రాత్‌లో సైతం కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నా మోదీ, ప్రభుత్వ యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పు డు ప్రచారం చేయడంతో బీజేపీ గెలుపొందిందని ఆరోపించారు.
ఎంఐఎం, ఆప్ లాంటి పార్టీలను ప్రోత్సహించి లౌకికవాదుల ఓట్లు చీల్చి బీజేపీ లబ్ధి పొందిందన్నారు. ప్రధాని తన స్థాయిని దిగజార్చుకొని ఒక రాష్ట్ర ఎన్నికల కోసం 36 సభలకు పైగా పాల్గొన్న పరిస్థితి దేశంలో ఇప్పటివరకు చూడలేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం చేసే యాత్ర కాదని స్పష్టం చేశారు.
అది విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని ఐక్యం చేసేందుకు చేస్తున్న పాదయాత్ర అని పేర్కొన్నారు. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర నడుస్తోంది తప్ప ఎన్నికల యాత్ర కాదని చెప్పారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నందునే క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందని, పార్టీలో లేకుంటే నోటీసు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.